వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి జోగి రమేష్‌కు పరాభవం ఎదురైంది. ఇటీవల అమరావతిలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ వీర మహిళా విభాగం నాయకురాళ్లు.. మంత్రి జోగికి గాజులు, చీర తీసుకువెళ్లా రు. “పనులు చేయడం చేతకాని.. అభివృద్ధి చేయడం చేతకాని మంత్రికి.. ఇంతకన్నా ఏమిస్తాం.. ఇవి చాలు!“ అని పలువురు వీర మహిళలు వ్యాఖ్యానించారు. జనసేన వీర మహిళా కమిటీ సభ్యులు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి విజయవాడ నుంచి పెడన బయలుదేరారు.
అయితే, మార్గమధ్యంలో గూడురు దగ్గర పోలీసులు కారును నిలిపివేశారు. అయితే.. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళా నాయకురాళ్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తమను ఎందుకు ఆపుతున్నారని.. తాము నిరసన వ్యక్తం చేసే హక్కును కూడా వినియోగించుకోకూడదా? అని ప్రశ్నించారు. అయితే.. పోలీసులు కూడా ఎదురు దాడికి దిగారు. దీంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం జనసేన మహిళా నేతలను ఉయ్యూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాగా, ఈ ఘటనపై జనేన పార్టీ విజయవాడ నేత పోతిన మహేష్ స్పందించారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు. బూతులు తిట్టే వారిని వదిలేసే.. ప్రశ్నిస్తున్న వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని పోలీసులపై పోతిన ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నా.. అనరాని మాటలు అంటున్నా.. కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఏం చేసినా చర్యలు లేవు కాబట్టే పేట్రేగిపోతున్నారని విమర్శించారు. అరెస్టు చేసిన మహిళా నాయకురాళ్లను తక్షణమే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.