వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసి సంగతి తెలిసిందే. అప్పటినుంచి పార్టీకి సంబంధించిన విషయాలపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కోటంరెడ్డి గతంలో వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి వైసిపి నేతలపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా ఢీకొంటానని కోటంరెడ్డి ఛాలెంజ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో ముందు నుంచి జగన్ కు తాను అండగా ఉన్నానని కోటంరెడ్డి గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తన ఫోన్ ట్యాప్ చేశారని, నమ్మకం లేని చోట, అనుమానించిన చోట ఉండకూడదని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కోటంరెడ్డి వెల్లడించారు. తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, విద్యుత్ సరిగా ఉండటం లేదని ఆరోపించారు.
కొమురపూడి వంతెన నిర్మించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నానని, మునుమూడి వంతెన రోడ్ల కోసం 28 కోట్లు కేటాయిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారుజ. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అడిగానని, కాంట్రాక్టర్ రెండు కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి బిల్లు కూడా పాస్ కాలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను అడిగినా ఫలితం దక్కలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ ల నిర్మాణాలు చేపట్టాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం శూన్యం అని గుర్తు చేశారు.