టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు మద్దతుగా బాపట్ల కొత్త ఓడరేవు తీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ తో పాటు, బాపట్ల టీడీపీ ఇన్ చార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మల ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ వర ప్రసాద్ చంద్రబాబు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో అంధకారం ఏర్పడి ప్రజలు కన్నీరు పెడుతున్నట్లు శిల్పాన్ని రూపొందించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా చింతకాయల విజయ్, నరేంద్ర వర్మలతో పాటు 28 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. బాపట్ల సముద్ర తీరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఇంతమంది వ్యక్తులు ఇక్కడ గుమిగూడడంతో కేసు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. అయితే, సైకత శిల్పం ఏర్పాటు చేస్తుంటే ఏమి చేస్తున్నారని స్థానిక పోలీసులపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని, దాని తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
దీంతో, పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సముద్ర తీరంలో 144 సెక్షన్ ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూర్చున్నా..నిలుచున్నా తప్పే అన్నరీతిలో నియంత పాలన సాగుతోందని విమర్శలు వస్తున్నాయి.