మే 28వ తేదీన తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రకటించి.. జగద్వితం చేసిన అన్నగారు ఎన్టీఆర్ జన్మించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పటి వరకు ఉన్నచరిత్రను మార్చి తెలుగు వారికిప్రత్యేక చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. స్ఫూర్తిని దశ దిశలా చాటేందుకు.. టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఏడాది కాలంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఏప్రిల్ 28 నుంచి వచ్చే మే 28 వ తేదీ వరకు కూడా.. ఊరూ వాడా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
దీనికి విజయవాడలో రజనీకాంత్ చేతుల మీదుగా అంకురార్పణ చేయనున్నారు. నాటితరం వారి నుంచి నేటితరానికీ ఎంతో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ గురించి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా నేటి నుంచి నెలరోజులపాటు జయంతి ఉత్సవాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ క్రమశిక్షణ, పట్టుదల, శ్రమ, నిజాయితీ గురించి రేపటితరానికి స్ఫూర్తి చాటేలా కార్యక్రమాలను రూపొందించారు.
విజయవాడ శివారు తాడిగడప సమీపంలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు పెద్దఎత్తున అభిమానులు తరలిరానున్నారు. దాదాపు 50వేల మంది హాజరవుతారనే అంచనాతో కార్యక్రమానికి పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జన్మదినానికి నెలరోజుల సమయం ఉండటంతో నేటి నుంచి వరుసగా 100 ప్రాంతాల్లో 100 వేడుకలు నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటరీ నియోజకవర్గాలు.. సహా.. మండలాలు, గ్రామాలు.. పల్లెల్లోనూ ఎన్టీఆర్ శత జయంతులను నిర్వహిస్తున్నారు. ఆనాటి ఎన్టీఆర్ తరానికి చెందినవారిని ఘనంగా సత్కరించనున్నారు. మొత్తంగా.. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలు అంబరం అంటేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడికి ఘననివాళే అవుతుంది.