దేశంలో మరెక్కడా లేని రీతిలో చిత్రవిచిత్రాలన్ని తమిళనాడు ఎన్నికల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళ పార్టీలు వేటికవే ఆల్ ఫ్రీ హామీల్ని ఇచ్చేయటం తెలిసిందే. పార్టీలకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఒక స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే హామీల్ని ఇస్తూ అవాక్కు అయ్యేలా చేస్తున్నాడు. దేశంలోని రాజకీయ పార్టీలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూసేలా ఎన్నికల హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఇతగాడు ఇచ్చిన హామీల లిస్టు చూసి.. నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.
ఇంతకీ అతగాడు ఇచ్చిన హామీలేమంటే.. తనను ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలిపిస్తే.. నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం మీదకు తీసుకెళతానని హామీ ఇచ్చాడు. అంతేనా.. ఇంట్లోని ఆడోళ్లకు సాయంగా ఉండేందుకు ఇంటికో రోబోను ఇస్తానని.. ఇంటి పనిలో సాయంగా ఉంటుందని చెబుతున్నాడు. అంతేనా.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు కాలువలు తగ్గించి.. ఇంటికో పడవ ఇస్తానని చెప్పాడు. ఎండ తీవ్రత లేకుండా చేసేందుకు నియోజకవర్గంలోని 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండను ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు.
ప్రజలకు మరింత వినోదాన్ని కలిగించేందుకు వీలుగా కృత్రిమ సముద్రాన్ని.. అందుకు సరిపడా బీచ్ ను ఏర్పాటు చేస్తానని చెప్పిన అతను.. ఈ హామీలు సరిపోవని అనుకున్నాడో ఏమో కానీ.. నియోజకవర్గ ప్రజలందరికి ఉచితంగా ఐఫోన్ ఇస్తానన్న హామీని ఇచ్చేశాడు. ఇంతలా హామీల వరద పాటించిన ఈ అభ్యర్థి పేరు శరవణన్. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇతని హామీల్ని వింటుంటే.. రాజకీయ పార్టీల మీద మాంచి కసితో ఉన్నట్లుగా అనిపించక మానదు. ఎన్నికల్లో గెలుపు తర్వాత కానీ దేశ వ్యాప్తంగా ఒకట్రెండు రోజుల్లోనే ఫేమస్ అయ్యే సూచనలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి.