తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ సీనియర్ నాయకుడు, కృష్నాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేశారంటూ.. టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలి సిందే. జోగిపై విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు తీవ్రమైన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
ఇక, రాష్ట్రంలోని టీడీపీ సీనియర్లు, ఇతర నేతలు, నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి న వారు కూడా జోగిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. చంద్రబాబు ఇంటి దగ్గరకు వస్తే.. పాతేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు.
మరి ఇంత జరుగుతున్నప్పటికీ.. కృష్ణా జిల్లాలోని వైసీపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా జోగికి సపోర్టుగా గళం వినిపించిన పరిస్థితి కనిపించలేదు. నిజానికి ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి కొడాలినాని సహా.. పేర్ని నాని.. వంటివారు ఈ జిల్లాకు చెందిన వారే. అయినప్పటికీ.. జోగికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇక, జిల్లాకు చెందిన నేతలను పరిశీలిస్తే.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కానీ, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కానీ.. స్పందించలేదు. ఇలా .. మొత్తంగా ఏ ఒక్కరూ జోగికి అనుకూలంగా కామెంట్ చేయకపోగా.. టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు.
ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లో మంత్రి సుచరిత, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు మాత్రమే స్పందిం చారు. ఎక్కడో కడపలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. కానీ, సొంత జిల్లాకుచెందిన నేతలు మాత్రం మౌనంగా ఉన్నారు. దీనికి రీజనేంటి ? అనేది వైసీపీలోనే ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న వారు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వీరిలో పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్ వంటివారుముందు వరుసలో ఉన్నారు.
ఇక, మిగిలిన వారిలోనూ జోగి అంటే గిట్టని వారు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అనుకూలంగా నోరు మెదపడం లేదని.. ఆయనకు అనుకూలంగా మాట్లాడితే.. జోగికి మరింత ఫాలోయింగ్ పెరుగుతుందనే ఉద్దేశం వీరిలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను గమనిస్తే.. జోగి జిల్లా రాజకీయాల్లో ఒంటరి అయ్యారనే భావన స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.