రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పంపకాలు రగడ సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం.. ఎలాగైనా గెలిచి తీరాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయం వంటివి ఎమ్మెల్యేలను సంపాదన దిశగా అడుగులు వేయిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా పంపకాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రతి ఒటును ఒడిసి పట్టేందుకు ఎమ్మెల్యేలు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నియోజకవర్గాల హద్దులు దాటి మరీ.. సంపాదనకు చేతులు చాస్తున్నారు. ఇది సొంత పార్టీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలకు దారితీస్తోంది. కొందరు తమ అంగ బలం చూపిస్తూ.. దూసుకు పోతుంటే.. మరికొందరు ఢీ అంటే.. ఢీ అంటూ.. సొంత పార్టీ నేతలపైనే వివాదాలకు దారితీస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య ఇసుక లావాదేవీలు.. తగాదాలు.. పార్టీకి తలనొప్పిగా మారాయి.
ఇప్పుడు ఇవే రగడలు అనంతపురం వరకు పాకాయి. శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల మధ్య వివాదం ఈ తరహాదే కావడంతో పార్టీ అధిష్టానం అలెర్ట్ అయింది. ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, పద్మావతి వివాదాలపై గత కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నా.. తాజాగా పోలీసుల వరకు కూడా ఈ వివాదాలు ముందుకు సాగడం.. మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. మరోవైపు ఇటు తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దూకుడు పెరిగింది.
అదే సమయంలో శింగనమలలోనూ టీడీపీ వ్యూహాలు సక్సస్ అవుతున్నాయి. దీంతో ఉన్న ఇమేజ్ వైసీపీ పోగొట్టుకునే పరిస్థితిని .. టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులపై.. ప్రతిపక్షాలు యాగీ చేయాల్సిన చోట.. సొంత పార్టీ నేతలే.. సవాళ్లు యుద్ధం చేసుకోవడం.. స్టేషన్ల వరకు రావడం.. వంటివి వైసీపీ అధిష్టానాన్ని డిఫెన్స్‌లో పడేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై పార్టీ దృష్టి పెట్టింది. మరి ఏం చేస్తుందో ?చూడాలి.