ఒక్కసారిగా రాష్ట్ర, జిల్లా స్ధాయిలోని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించటం నిజంగా అభినందించాల్సిందే. శనివారం మధ్యాహ్నం 137 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఛైర్మన్ల నియామకంలో తమ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించిందని, మహిళలకు పెద్దపీట వేసిందని మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయం అందరు చూసిందే. ప్రభుత్వ ప్రకటన ఇలా రాగానే బ్రహ్మాండమని, జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతు, పాలాభిషేకాలు కూడా చేశారు.
సీన్ కట్ చేస్తే ప్రభుత్వం చేసిన తాజా నియామకాలతో అందరు హ్యాపీయేనా ? ఇక్కడే అంతర్లీనంగా నిరసన స్వరాలు కూడా వినబడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న చర్చల ప్రకారమైతే పార్టీ పదువులను ఇతర పార్టీల్లో నుండి వచ్చిన నేతలకు కూడా కట్టబెట్టారనే వాదన వినబడుతోంది. పదవులు అందుకున్న వారిలో మెజారిటి పార్టీ నేతలే ఉన్నా ఇతర పార్టీల్లో నుండి ఈమధ్యే వచ్చిన నేతల్లో కొందరికి పదవులు దక్కాయనే అసంతృప్తి వినబడుతోంది.
ఇతర పార్టీల్లో నుండి వచ్చి పదవులు అందుకున్న నేతలగురించి ఎవరు పేర్లతో ప్రస్తావన తేవటంలేదు. పదవులు అందుకున్న అలాంటి నేతల గురించి ప్రత్యేకంగా పేర్లతో చెప్పాల్సిన పనిలేదని, ఆయా జిల్లాల్లోని వారికి అందరికీ తెలుసంటు సమాధానం చెప్పి తప్పుకుంటున్నారు. ఇదే విషయమై ఓ టీవీ చర్చా కార్యక్రమంలో కూడా ఇద్దరు కాలర్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
పదవులు ఇవ్వటం సంతోషమే కానీ ఇచ్చేటపుడు మొదటినుండి పార్టీకి పనిచేసిన వాళ్ళెవరో గమనించాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో చేరిన వాళ్ళకు కూడా పదవులు కట్టబెట్టడం తమకు బాధ కలిగించిందని కాలర్స్ ప్రస్తావించారు. అంటే జరుగుతున్నది చూస్తుంటే హోలు మొత్తంమీద నేతలు హ్యాపీగానే ఉన్నా పదవులు అందుకున్న కొందరి విషయంలోనే పార్టీలోనే అసంతృప్తి ఉందనే విషయం బయటపడింది.