ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు రోజుకో తలనొప్పి తప్పట్లేదు. ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులేస్తున్న ఏపీలో ప్రభుత్వాన్ని నడపడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలకు మించిన భారంగా మారిన ఈ సమయంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు లేని పోని వివాదాల్లో చిక్కుకుంటుండటం చికాకు తెప్పించేదే.
కొన్ని రోజుల కిందటే అంబటి రాంబాబు ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ మహిళతో ఆయన సరస సంభాషణలు సాగిస్తున్నట్లుగా పేర్కొన్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియో తనది కాదంటూ అంబటి రాంబాబు ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేయడం తెలిసిందే.
తన గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఎలాంటి చర్యలు చేపట్టారో కానీ.. ఆ ఆడియో మాత్రం వైరల్ అయి అంబటి రాంబాబు ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది.
ఇప్పుడిక మరో వైకాపా ముఖ్య నాయకుడు ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆయనే విశాఖపట్నానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్. గురువారం ఆయన పేరుతో ఒక ఆడియో సోషల్ మీడియాను హోరెత్తించింది. ఒక మహిళను తన వద్దకు రమ్మంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్లో బలవంత పెడుతున్నట్లుగా ఉంది ఆ సంభాషణ.
ఇందులోని వాయిస్ అవంతి శ్రీనివాస్‌దే అని ఆరోపిస్తున్నారు నెటిజన్లు. మంత్రి మీద ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై అవంతి శ్రీనివాస్ కూడా స్పందించారు. ఈ ఆడియోలోని గొంతు తనది కాదని, ఐతే తన గురించి ఇలాంటి ప్రచారం జరగడం తనను చాలా బాధ పెట్టిందని.. వైజాగ్ కమిషనర్‌కు దీనిపై ఫిర్యాదు చేయబోతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ఆడియోలు బయటికి వచ్చినపుడు అందులోని వాయిస్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులవే అని నిరూపించడం కష్టం. అదే సమయంలో వాయిస్‌లు తమవి కాదనీ ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లూ రుజువు చేయలేరు. కానీ ఆ నేతలకు జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోతుంది.
ఇంతకుముందు వైకాపాకే చెందిన పృథ్వీ పరిస్థితి ఓ ఆడియో కారణంగా ఎలా తయారైందో తెలిసిందే. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లిద్దరూ కూడా ఇమేజ్ పరంగా డ్యామేజ్ తప్పేలా లేదు.