వైసీపీ అధ్యక్షడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారో ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎప్పటికప్పుడు బటయపెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల. ఇటీవల ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడుతూ.. నా చెల్లెలు షర్మిలపై బాలకృష్ణ తన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి తప్పుడు వార్తలు రాయించారంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మీడియా ముఖంగా షర్మిల స్పందించింది.
నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఆరోపణలు చేస్తూ వీడియోలు చూపిస్తున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇలా జరిగిందని తెలుకున్న మీరు ఏం చేశారు? గాడిదలు కాశారా? చెల్లెలుపై ప్రేమ ఉంటే విచారణ ఎందుకు చేయలేదు? అని షర్మిల ప్రశ్నించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని జగన్ ప్రచారం చేయించారని షర్మిల గుర్తు చేశారు.
ప్రభాస్ తో ఎటువంటి రిలేషన్ లేదని ఆనాడు నా పిల్లలపై ఒట్టేసి చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదని షర్మిల అన్నారు. జగన్ తన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్లో పెడతారు.. నాపై దుష్ప్రచారం చేయిస్తారని షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు షర్మిలపై అసత్య ప్రచారం చేయించానని జగన్ విమర్శలు చేయడం పట్ల నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాలయ్య గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ టైమ్ లో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని, ఈ విషయాన్ని వారే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలంటూ బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.