శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. గత రెండు వారాల నుంచి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీ ఓ కొలిక్కి రావడం లేదు. దాదాపు 16 రోజుల నుంచి దువ్వాడ ఇంటి ముందున్న కారు షెడ్ లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణి, కుమార్తెలు నిరసన తెలుపుతున్నారు. తమకు ఆస్తులు వద్దని.. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉండటానికి తాను, తన పిల్లలు సిద్ధంగా ఉన్నామని వాణి చెబుతోంది.
అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అందుకు ససేమేరా అంటున్నారు. వాణితో మళ్లీ కలుసుండే అవకాశం లేదని తేల్చేశారు. అలాగే తన ఇంటి వద్ద నిరసన చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని దువ్వాడ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడితో ఆగకుండా తన ఇంటి వద్ద టెక్కలి వైసీపీ కార్యాలయం అని బోర్డు పెట్టించారు.
దాంతో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ పై సీరియస్ అయింది. కుటుంబ వివాదాన్ని రాజకీయం చేసి పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుండటంతో.. టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను తొలగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించినట్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.