ఏపీ విపక్షం వైసీపీ నుంచి ఇటీవల కాలంలో జంపింగులు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కీలక నాయకుడు, జగన్కు అత్యంత సన్నిహితుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనా మా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్టు కూడా తెలిపారు. అయితే..ఈ వ్యవహారం ఇలా ఉంటే.. మరోవైపు గుంటూరు జిల్లా కు చెందిన రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారంటూకొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఆళ్ల స్పందించారు. “ఔను.. మాపై ఒత్తిళ్లు ఉన్నాయి. కొన్ని పార్టీల నుంచి ఆహ్వానా లు అందుతాయి. అది సహజం. ఓడిపోయిన పార్టీపై అన్ని వైపుల నుంచి దాడులు జరగడం కూడా మామూలే. అయినా.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తాం. నేడు ఒక పార్టీలో ఉండి.. రేపు మరో పార్టీలో చేరే వ్యక్తులం కాదు. అయితే.. మాపై ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవం. మాపైనే కాదు.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపైనా ఒత్తిళ్లు ఉన్నాయి. పోయేవారు పోతారు. అయినా.. పార్టీ శాశ్వతం“ అని అయోధ్యరామిరెడ్డి అన్నారు.
రాజకీయాల్లోనే కాదు.. వ్యక్తుల జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు వస్తాయన్నారు. అంత మాత్రాన జీవితాలను కోల్పోతామా? అని ఆళ్ల ప్రశ్నించారు. మరోవైపు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేవారి జాబితా పెద్దదిగానే ఉందని.. ఒకరు తర్వాత ఒకరు బయటకు రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్ కు అత్యంత సన్నిహిత నేతగా ఉన్న సాయిరెడ్డే బయటకు వచ్చినప్పుడు.. మిగిలిన వారు కూడా వచ్చే యడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించడంగమనార్హం.