తాజాగా ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పెనమ లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఇక, ఆ పార్టీ నుంచి బయటకు రావడం తప్ప మార్గం కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ అధిష్టానం ఇంకా పెనమలూరు సహా కొన్ని నియోజకవర్గాలపై సమీక్ష చేయాల్సి ఉంది. అప్పటికి కానీ.. కొలుసుకు టికెట్ ఉందో లేదో తెలిసే అవకాశం లేదు. అయితే.. ఆయన మాత్రం తొందరపడ్డారని అనుచరులు చెబుతున్నారు.
పార్టీ పరంగా చూసుకుంటే.. వైసీపీలో ఆది నుంచి ఉన్న అనేక మందికి అవకాశాలు రాలేదు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వంటి వారు చాలా మంది వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. పైగా సీఎం జగన్ వెంటే ఆది నుంచి అడుగులు వేశారు. కానీ, వారికికూడా అని వార్య కారణాలతో పదవులు దక్కలేదు. అంత మాత్రాన వారేమైనా రోడ్డున పడ్డారా ? అనేది వైసీపీ సీనియర్ల ప్రశ్న.
“150 మంది ఎమ్మెల్యేలు.. అంతకు మించిన సంఖ్యలో ఆశావహులు ఉన్న వైసీపీలో అనేక మందికి అనేక కోరికలు ఉంటాయి. ఎంత మందినని సీఎం జగన్ సంతృప్తి పరుస్తారు? ప్రతి ఒక్కరికీ మంత్రి కావాలనే ఉంటుంది. అలా అందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటూ పోతే.. ఎమ్మెల్యేలు ఉండరు. మంత్రులే ఉంటారు. ఆయన అలా మాట్లాడడం సరికాదు. వేచి చూస్తే.. రావాల్సిన పదవులు అవే వస్తాయి“ అని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
మరికొందరు కొలుసు వ్యవహారంపై మౌనంగా ఉన్నారు. ఆయన గోడమీద పిల్లిగా వ్యవహరిస్తున్నారని.. అందుకే పార్టీ ఆయనను దూరం పెట్టిందని.. చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడమే తప్ప. కొలుసు చేసింది ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి సర్వేలు, అభ్యర్థుల గ్రాఫ్ ఆధారంగానే సీఎం జగన్ ఎంపికలు ఉన్నాయనిచెబుతున్నారు. ఏదేమైనా సీనియర్ నాయకుడు అయి ఉండి.. ఎన్నికల వేళ ఇలా చేస్తారా? అనే ప్రశ్నలు కూడా వస్తుండడం గమనార్హం.