వైసీపీ నాయకులను ఎవరైనా కలిసి మీకు బలమైన ఓటు బ్యాంకు ఎక్కడుంది? అంటే.. వెంటనే చెప్పే మాట.. విలేజ్ ఓటు బ్యాంకు గురించే. నిజానికి 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి పట్టణ, నగర ఓటర్లు కూడా సహకరించారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాము కడుతున్న పన్నులను వివిధ పథకాల రూపంలో ఉచిత పంపకాలు వాడేస్తున్నారని.. ఎక్కడా అభివృద్ధి లేదని.. నగర, పట్టణ ఓటర్లు వాపోతున్నారు.
దీనికితోడు.. ధరలు పెరిగిపోవడం, ఉపాధి, ఉద్యోగాలు లేకపోవడం వంటివి కూడా యువత మధ్య చర్చ కు వస్తున్నాయి. సో.. వైసీపీకి ఈ సారి పట్టణ, నగర ఓటర్లు చేరువ అయ్యే అవకాశం లేకుండా పోయిందనే చర్చ సాగుతోంది. సో.. దీంతో వైసీపీ నాయకులు, అధినేత కూడా.. గ్రామీణ ఓటు బ్యాంకు, ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వివిధ పథకాలు అమలు చేస్తుండడంతో వారంతా తమ వెంటే ఉంటారని అనుకుంటున్నారు.
అయితే.. ఇక్కడే టీడీపీ చాలా వ్యూహాత్మకంగా సైలెంట్ వేటు వేస్తుండడం గమనార్హం. వైసీపీకి చిక్కకుం డా.. దొరకుండా.. గ్రామీణ ప్రాంతాలపై టీడీపీ పట్టుబిగిస్తోంది. ఈ ఏడాది మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను.. గ్రామీణ స్థాయిలో పక్కాగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎలా అంటే.. ప్రచార మాధ్యమాలకు అందనంత రేంజ్లో గ్రామీణ ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి.. టీడీపీ మహిళా ప్రతినిధులు ప్రచారాన్ని దంచి కొడుతున్నారు. ఒక్కొక్క మండలంలో రెండేసి వారాల చొప్పున కేటాయించుకున్నారు.