ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తోంది.. అధికారం చేజారే సమయం సమీపిస్తోంది.. అది వైసీపీ అధినేత జగన్కు మింగుడుపడటం లేదని సమాచారం. అందుకే ఎన్నికల ప్రక్రియ ఆరంభం నుంచి వైసీపీ నేతలు దౌర్జన్యాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పోలింగ్ రోజు ఆ అరాచకం మరింత పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంనే ధ్వంసం చేశారు. ఇప్పుడిక కౌంటింగ్ రోజు కూడా ఘర్షణలు జరిగి, సమస్యలు చేలరేగేలా వైసీపీ నాయకులు వ్యూహాలు పన్నుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని అడ్డుకోవడం కోసం జగన్ శతవిధాలా ప్రయత్నించారు. అక్కడి వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను కూడా చేస్తా అన్నారు. కానీ పవన్ గెలుపు ఖాయమవడంతో వైసీపీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని టీడీపీ నేత వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏదో రకంగా గొడవలు సృష్టించి, కౌంటింగ్ నిలిపి వేయించడమే వైసీపీ లక్ష్యంగా కనబడుతోందని వర్మ ఆరోపించారు.
కౌంటింగ్ రోజున అల్లర్ల కోసం వైసీపీ పెద్ద ప్లాన్ చేసిందని వర్మ అన్నారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీషీటర్లు, గుండాలను నియమిస్తోందని వర్మ ఆరోపించారు. కౌంటింగ్ ఏజెంట్ల ముసుగులో వీళ్లు దౌర్జన్యాలకు తెగించే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఏ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను అయినా సరే క్షుణ్నంగా పరిశీలించాలని ఎన్నికల అధికారులను, పోలీసులను వర్మ కోరారు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి లేకుండా కౌంటింగ్ సవ్యంగా సాగాలే చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.