గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్న రీతిలో కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ రాకను మొదటి నుంచి యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, వైసీపీ అధిష్టానం మాత్రం ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న రీతిలో వంశీకి ప్రాధాన్యతనిచ్చి…వెంకట్రావును తొక్కేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన అనుచురులతో సమావేశమైన యార్లగడ్డ త్వరలోనే టీడీపీలో చేరతానని పరోక్షంగా ప్రకటించారు.
అపాయింట్ మెంట్ ఇస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతానని, వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకట్రావుకు చంద్రబాబు అపాయింట్ మెంట్ లభించింది. దీంతో, తాజాగా చంద్రబాబుతో యార్లగడ్డ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమైన యార్లగడ్డ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ చేరతానని యార్లగడ్డ ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అయ్యానని, టీడీపీలో చేరేందుకు తాను సుముఖంగా ఉన్న విషయాన్ని ఆయనకు చెప్పానని అన్నారు.
సానుకూలంగా స్పందించిన చంద్రబాబు..కలిసి పని చేద్దాం రమ్మంటూ తనను పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు. త్వరలోనే టిడిపిలో చేరుతానని, చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపించారని, పార్టీలకతీతంగా ఆ విషయాన్ని ప్రజలు అంగీకరించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం తపించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఇక, గన్నవరం టీడీపీ టికెట్ పై హామీ లభించిందా అని మీడియా ప్రశ్నించింది. అయితే, చంద్రబాబు ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, గుడివాడ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమని వెంకట్రావు ప్రకటించారు.