ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మంచి ఎకో సిస్టం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు లోకేష్ పిలుపునిచ్చారు.
ఆ తర్వాత ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖా మంత్రి లోకేష్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ప్రశంసించారు. పెట్టుబడుల ఆకర్షణలో భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో కాన్సులేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
మరోవైపు, ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను నారా లోకేష్ విడుదల చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని బోసన్ సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆ ట్రక్కులను ఆవిష్కరించానని లోకేష్ తెలపారు. ఆ తర్వాత బోసన్ సంస్థ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యానని, ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి చర్చించామని తెలిపారు. ఈ సంస్థల అనుబంధ యూనిట్లను ఏపీలో ఏర్పాటుచేయాలని కోరానని, సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు.
ఇక, శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించానని లోకేష్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డేటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్ కు పేరుందని లోకేష్ చెప్పారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఉన్న అనుకూలతలు, ప్రోత్సాహకాలను సంస్థ ప్రతినిధులకు వివరించానని, ఏపీకి రావాలని కోరానని తెలిపారు.