“పొత్తుల విషయంలో మమ్మల్ని వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారు. కానీ, మాది తెరచాటు పొత్తులు కాదు. నేరుగా ప్రజల కోసం.. కలిశాం. ప్రజల కోసమే కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి? దుష్టులను తెగటార్చేందుకు కలిసిముందుకు సాగాలని నిర్ణయించాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు పొత్తులు పెట్టుకున్నాం“ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా కుప్పంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రతిసీటును గెలిచేలా సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఏపీలో అరాచకపాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని… రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని తెలిపారు. అందుకే.. కొన్ని కొన్ని విభేదాలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి ప్రజల కోసం కలిశామన్నారు.
ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు. ముస్లిం మైనారిటీ పూర్తిగా టీడీపీ వెంటే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.