ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. 28 ఏళ్ల క్రితం నమోదైన దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల పాటు జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 1994లో రామచంద్రపురం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపై తోట త్రిమూర్తులు దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే త్రిమూర్తులుపై కేసు నమోదై 28 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది.
28 ఏళ్ల తర్వాత అయినా తమకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. ఒకవైపు మండపేట వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తోట త్రిమూర్తులు పై ఈసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా ఆయనను డిస్ క్వాలిఫై చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.