ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీలో నిర్వహించిన కూటమి రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో ముగిసిన తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ పై నిప్పులు చెరిగారు.
ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారి, ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడంటూ పరోక్షంగా జగన్ పై చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. మే 13న ఆ సైకో పాలనకు అంతం పలకడానికి మీరంతా సిద్ధమా? మే 13న వైసీపీకి డిపాజిట్లు అయినా వస్తాయా? అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు.
ఒక పక్క జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇంకోపక్క తెలుగుదేశం పార్టీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ… ముగ్గురం కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా? అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమే అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ నెల్లూరులో గల్లీగల్లీ తెలుసని, చరిత్ర తిరగరాసేందుకు నెల్లూరు తిరగబడిందని అన్నారు. యువతకు బంగారు భవిష్యత్ చూపించడం తన బాధ్యత, పవన్ కల్యాణ్ బాధ్యత అని అన్నారు.
రాసిపెట్టుకోండి…25 లోక్ సభ స్థానాలకు 24… వీలైతే 25కి 25 మనం గెలుస్తున్నాం… 160కి పైబడి అసెంబ్లీ స్థానాలు కూడా మనమే గెలుస్తున్నాం. అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయని, ఉద్యోగస్తులంతా… 95 శాతం, వీలైతే 100 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.