సాల్మన్ అహిషోర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. 2010లో జరిగిన పుణె బేకరీ బాంబు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని పట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మంచి టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఉగ్రవాదులను పట్టుకునే ఎన్ఐఏ టీం హెడ్ గా నాగ్ నటన ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ‘వైల్డ్ డాగ్’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఇది వారాంతంలో విడుదలయ్యే సినిమాల వంటిది కాదన్న చిరు…ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కితాబిచ్చారు. తాను ఇప్పుడే వైల్డ్‌డాగ్ చూశానని, ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రం ఇదని చిరు అన్నారు.
అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్లకి కట్టినట్టుగా చూపించారని చిరంజీవి ప్రశంసించారు. ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వేటాడిన రియల్ లైఫ్ హీరోలని అద్భుతంగా చూపించిన సోదరుడు నాగార్జునను అభినందిస్తున్నానని చిరు అన్నారు. అలాగే, వైల్డ్ డాగ్ టీంని, దర్శకుడు సాల్మన్, నిర్మాత నిరంజన్ రెడ్డిని అభినందిస్తూ చిరు ట్వీట్ చేశారు.