ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తొందరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. వినాయక్ ది పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు సొంతూరు. సినీ పరిశ్రమలో వినాయక్ చాలా పాపులర్ అనే చెప్పాలి. అనేకమంది హీరోలతో చాలా సినిమాలే తీశారు. కొంతకాలంగా సినిమాలు తగ్గించుకుని రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటినుండి జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుగా ఉన్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీకి రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
ఏలూరు లేదా కాకినాడ నుండి లోక్ సభకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావటం కూడా వినాయక్ కు బాగా కలిసొస్తోందట. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ, కాపు సామాజికవర్గాల్లో మెజారిటి ఎవరికి మద్దతుగా నిలబడుతుందో ఆ పార్టీదే విజయమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో బాగంగానే ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పై సామాజికవర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
జగన్, చంద్రబాబును పక్కనపెట్టేస్తే స్వయంగా కాపు సామాజికవర్గంకు చెందటం పవన్ కు కాస్త అనుకూలించే అంశం. అయితే పవన్ కు కాపులు ఎంతమాత్రం మద్దతుగా నిలబడతారనే విషయంలో అయోమయం ఉంది. ఎందుకంటే ఒక్కోసారి పవన్ ఒక్కోవిధంగా మాట్లాడుతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున వినాయకను పోటీలోకి దింపితే ఉభయగోదావరి జిల్లాల్లో ఉపయోగం ఉంటుందని జగన్ అనుకున్నారట. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానభంను పార్టీలో చేర్చుకోవాలని జగన్ అనుకోవటానికి కూడా కాపు సామాజికవర్గం మద్దతు కోసమే అని అందరికీ తెలిసిందే.
కాపుల్లో ప్రముఖులను, గట్టిపట్టున్న వ్యక్తులను వైసీపీ తరపున పోటీచేయిస్తే లాభం ఉంటుందని జగన్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే వినాయక్ తో పార్టీలోని ముఖ్యలు చర్చలు జరుపుతున్నారట. కాకినాడ ఎంపీ వంగాగీత ఎంపీగా కాకుండా పిఠాపురం ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నారు. కాబట్టి కాకినాడ ఎంపీగా కొత్త వ్యక్తిని పోటీలోకి దింపాల్సిందే. అందుకనే ముద్రగడా లేకపోతే వినాయకా అన్న పేర్లపై చర్చలు నడుస్తున్నాయి. పార్టీవర్గాల సమాచారం ప్రకారం వినాయక్ పార్టీలో చేరిన తర్వాతే ఎక్కడి నుండి పోటీ అన్నది డిసైడ్ అవుతుందట.