ఒలింపిక్స్‌లో తన సత్తా చాటుతూ.. తొలి మూడు రౌండ్లు దూసుకుపోయిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. చిట్టచివరి దశలో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారన్న కారణంగా ఆమెకు 50 కేజీల రెజ్లింగ్ నుంచి ఆమెపై నిషేధం విధించారు. లేకపోయి ఉంటే.. అమెరికా రెజ్లర్‌తో ఆమె తలపడి ఉంటే.. ఖచ్చితంగా భారత్‌కు స్వర్ణమో.. రజత పతకమో అంది ఉండేది. కానీ, 100 గ్రాముల తేడాతో ఆమె ఏకంగా పోటీ నుంచి నిషేధానికి గురయ్యారు. అయితే.. దీనిపై ఆమె న్యాయ పోరాటానికి దిగారు.
క్రీడల మధ్యవర్తిత్వ న్యాయ స్థానం(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)లో వినేష్ ఫొగట్ అప్పీల్ చేశారు. ఇలా 100 గ్రాముల బరువు పెరగడానికి తన తప్పులేదని ఆమె పేర్కొన్నారు. కాబట్టి.. తాను పోటీలో పాల్గొన్నట్టుగా గుర్తించి.. రజత పతకం అయనా ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. అయితే.. వినేష్ అభ్యర్థనను ఇటీవల ఆలకించిన కాస్.. ఈ నెల 16న తిరిగి వింటామని వాయిదా వేసింది. దీంతో భారతీయులు సహా.. ఒలింపిక్ దేశాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. అయితే..అనూహ్యంగా బుధవారం రాత్రి.. కాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వినేష్ ఫొగట్ దాఖలు చేసిన అప్పీలును తిరస్కరించింది.
ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం బుధవారం రాత్రి తెలిపింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష కాస్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. బాక్సర్ విజయేంద్ర సింగ్ స్పందిస్తూ.. వినేష్ అప్పీల్‌ను తిరస్కరించడం చాలా బాధాకర విషయమని తెలిపారు. వినేష్ పోటీపడి ఉంటే భారత్ కు ఖచ్చితంగా స్వర్ణ పతకం వచ్చి ఉండేదని తెలిపారు. కాస్ నిర్ణయంతో భారత క్రీడా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. వినేష్ విజ్ఞప్తిని తిరస్కరించడం వల్ల పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు కలిపి ఆరు పతకాలు మాత్రమే దక్కినట్లు అయింది.