మామూలుగా ఉంటే విజయసాయికి అస్సలు నచ్చదేమో. కదిలించుకొని మరీ తిట్టించుకోవటంలో ఆయనకు సాటి వచ్చే వారెవరూ ఉండరన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. మామూలుగా ఉన్న సీన్ ను.. చిరిగి చాటయ్యేలా చేసుకోవటంలో ఆయన తర్వాతే ఎవరైనా. సున్నిత అంశాల్ని డీల్ చేసేందుకు ఏ మాత్రం చేతకాని మొరటు విజయసాయిని సీఎం జగన్ ఎందుకు ఎంపిక చేస్తారో అస్సలు అర్థం కాదు. విజయసాయి పుణ్యమా అని.. జగన్ సర్కారు బుక్ కావటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.
తాజాగా అలాంటి పనే చేశారాయన.ఆంధ్రులహక్కు విశాఖ ఉక్కు విషయంలో చేయాల్సిందంతా చేసి.. మైలేజీ కోసం విజయసాయి పడుతున్న తపన చివరకు ఏదో కాస్తా మరేదో అయ్యేలా చేసింది. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేసే అంశంపై ఇప్పటివరకు ఘాటుగా ప్రశ్నించలేని జగన్ సర్కారు.. దాన్ని కవర్ చేసుకోవటం కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాలపై విరుచుకుపడటం.. దూకుడు మాటలతో నిందలు వేయటం లాంటివి చేస్తున్నారు. ఇవి సరిపోదన్నట్లుగా ప్రజల్ని మభ్య పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం అభాసుపాలైంది.
భావోద్వేగాలతో ప్రజలు రగిలిపోతున్న వేళ.. వారితో గేములు ఆడుకోవటం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే..నిప్పును ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసినా.. చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. తాజాగా అలాంటి పరిస్థితే విజయసాయికి ఎదురైంది. అడగకుండానే వరాలు ఇస్తూ.. భారీ మైలేజీ సొంతం చేసుకునే ఆయన ప్రయత్నంతో వైసీపీ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.విశాఖ ఉక్కు ఎపిసోడ్ లో తాము వెనుకబడిపోతున్న భావనకు గురైన విజయసాయి.. హడావుడిగా అఖిలపక్షంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దానికి పార్టీ నేతలతో పాటు.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. తాను రావటంతో.. వైఎస్ జగన్ స్వయంగా వస్తున్నంత కలర్ ఉంటుందన్నది ఆయన ఆలోచన. సీఎంకు అత్యంత సన్నిహితుడైన విజయసాయి.. అఖిలపక్షానికి వస్తుండటంతో విపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. సమావేశంలో లీడ్ రోల్ పోషించిన విజయసాయి.. బొమ్మను బాగానే మేనేజ్ చేశారన్న భావన కలిగి.. మరికొద్ది నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగిస్తారనుకున్న వేళ.. ఆయన చేసిన ఒక వ్యాఖ్య మొత్తం సీన్ ను మార్చేయటమేకాదు.. తిట్టనోళ్లు కూడా తిట్టేసే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు.
స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పిన విజయసాయి.. మీతో పాటు ఉద్యమాల్లో ముందుండి నడిపిస్తామన్నారు. మీరు అడగకున్నా మీకు ఒకటి చెప్పాలన్న ఆయన.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన కార్మిక సంఘాల ముఖ్యనేతలతో ఉక్కుశాఖా మంత్రి అపాయింట్ మెంట్ తీసుకొని కలిపిస్తామని చెప్పారు. దీంతో.. తనకు తిరుగులేని మైలేజీ వస్తుందని అంచనా వేశారు. అనూహ్యంగా సీన్ రివర్సు కావటమే కాదు.. తమకు కేంద్ర ఉక్కుమంత్రితో కాదు.. ప్రధానమంత్రి మోడీతో అపాయింట్ మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ మాటకు అక్కడున్న వారంతా వంత పాడటంతో.. విజయసాయికి ఉక్కపోత మొదలైంది. మోడీతో అపాయింట్ మెంట్ అంటే తాను చెప్పలేనని.. కేంద్రమంత్రితో అయితే తాను గ్యారెంటీగా కల్పిస్తానని చెప్పారు. అంతవరకు ఆగినా బాగుండేది. ఇక్కడే మరో మాట అనేసి.. అడ్డంగా బుక్ అయ్యారు.ఆయన్ను కలిసినా కచ్ఛితంగా ఫలితం ఉంటుందో లేదో తెలీదన్న మాటను చటుక్కున నోరు జారేశారు. ఉక్కుమంత్రిని కలవం.. ప్రధానితోనే కలుస్తామని పట్టుదలకు పోవటం వల్ల ప్రయోజనం లేదన్నారు.
తాను చెప్పాల్సింది చెప్పాననని.. మీరు వస్తారో.. రారో మీ ఇష్టమని పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడినట్లు మాట్లాడేశారు. దీంతో.. అప్పటివరకు వేదిక మీదా.. కిందా ఓపిగ్గా ఆయన మాటల్ని విన్నవారంతా ఒక్కసారి కస్సుమన్నారు. అప్పటికి కానీ తాను అన్న మాటల్లో తేడాను గుర్తించారు. కానీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.విజయసాయి మాటలకు విపక్ష నేతలే కాదు.. కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో.. ఏదో చేయాలనుకున్న విజయసాయి మరేదో చేశాడని.. మొత్తంగా చిరిగి చాట అయ్యేలా చేయటంలో విజయసాయికి తిరుగులేదన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న రాముడి విగ్రహానికి అపచారం జరిగిన సమయంలోనూ నిమ్మాడకు వెళ్లిన విజయసాయి కారణంగా చోటు చేసుకున్న రచ్చ తెలిసిందే. ఇలా తాను వెళ్లిన ప్రతిచోట తన మాటలతో.. చేతలతో జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి..విజయసాయి విషయంలో జగన్ మాష్టారు కాస్త సీరియస్ గా ఫోకస్ చేస్తే మంచిదేమో?