‘గీత గోవిందం’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో రెండో సినిమా.. దీనికి తోడు దిల్ రాజు ప్రొడక్షన్.. తెలుగులో ఇప్పటికే రెండు ఘనవిజయాలు అందుకున్న మృణాల్ ఠాకూర్ హీరోయిన్.. ఇంతకంటే క్రేజీ కాంబినేషన్ ఏముంటుంది? ‘ఫ్యామిలీ స్టార్’ మొదలైనపుడు ఇది స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అనుకున్నారంతా. ప్రోమోలు అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ మూవీ అవుతుందనే అనుకున్నారు.
కానీ ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. తొలి రోజు డివైడ్ టాక్‌ను తట్టుకుని సాయంత్రం, నైట్ షోలకు ఆక్యుపెన్సీలు బాగానే రావడంతో వీకెండ్ వరకు సినిమా బాగానే నిలబడుతుందని అనుకున్నారు. కానీ రెండో రోజు కథ మారిపోయింది. ముందు వారంలో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ శనివారం నైజాం ఏరియాలో రూ.90 లక్షల షేర్ వసూలు చేసింది. కానీ ఈ వారం రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’కు నైజాం ఏరియాలో రెండో రోజు కేవలం 80 లక్షల షేర్ వచ్చింది. ఓవరాల్ నైజాం షేర్ రూ.2.3 కోట్లకు పరిమితమైంది.
ఇక ఆంధ్రా ఏరియాలో అయితే ‘ఫ్యామిలీ స్టార్’ పరిస్థితి దయనీయంగా ఉంది. శనివారం మొత్తం కలిపి షేర్ రూ.45 లక్షలు మాత్రమే వచ్చింది. వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అవడం మామూలే కానీ.. ‘ఫ్యామిలీ స్టార్’కు రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజు పరిస్థితి చూసి ఆశతో ఉన్న బయ్యర్లు.. రెండో రోజు వసూళ్లు చూసి బెంబేలెత్తిపోయారు. ఆదివారం ఓ మోస్తరు వసూళ్లు రావచ్చేమో. సోమవారానికి సినిమా నుంచి చెప్పుకోదగ్గ షేర్ ఆశించే అవకాశమే లేదు. విజయ్ కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.