రీల్ వేరు రియల్ వేరు అని సింఫుల్ గా చెప్పేస్తుంటారు. మనమరాలుగా నటించిన నటితో హీరోయిన్ గా జత కట్టటం మనకు తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా రీల్ అయినా.. రియల్ అయినా.. భావోద్వేగాల విషయంలో మాత్రం ఒక్కటేనని స్పష్టం చేస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రముఖ నటుడు సేతుపతి. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఆయన ఇమేజ్ తో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య వరకు తమిళ చిత్రాలకు పరిమితమైనా.. ఇటీవల కాలంలో తెలుగులోనూ భారీగానే అవకాశాలు వస్తున్నాయి.
ఈ మధ్యలో ఆయన నటించిన పలు సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. మొదటి లాక్ డౌన్ తర్వాత విడుదలై.. ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించిన సినిమాల్లో ఒకటి ఉప్పెన. ఈ సినిమాలో సేతుపతి పాత్రకు మంచి స్పందన రావటం తెలిసిందే. తాజాగా అతను శ్రుతిమాసన్ తో కలిసి ఒక సినిమా చేశారు. ఈ మూవీ విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అందరూ అవాక్కు అయ్యే మాట ఆయన నోటి నుంచి వచ్చింది.
ఉప్పెన మూవీలో కృతిశెట్టికి తండ్రిగా నటించిన సేతుపతిని.. తాజాగా ఒక సినిమా తర్వాత ఆమెతో జత కట్టాలని తమిళంలో ఒక ఆఫర్ వచ్చిందని.. అందుకు నో చెప్పినట్లుగా చెప్పారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు ఆయనే బదులిచ్చారు. ‘ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించా. ఇప్పుడు ఆమెతో రొమాన్సు చేయాలంటే నాకు సాధ్యం కాదు. ఉప్పెనలో కృతిశెట్టికి నేను తండ్రి పాత్రను పోషించినట్లు కొత్త సినిమా టీంకు తెలీదు. దీంతో.. వారు నాకు ఆఫర్ చేశారు. నేను రిజెక్టు చేశా’’ అని చెప్పారు.
ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా కృతిశెట్టితో తాను జత కట్టలేనని స్పష్టం చేశారు. ఉప్పెన క్లైమాక్స్ చేస్తున్న వేళలో.. ఆమె కంగారుపడిందని.. దాంతో నేను ఆమెను సముదాయించినట్లు చెప్పారు. ‘నాకు నీ అంత కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. నువ్వేం భయపడకు. ధైర్యంగా చేయ్’ అంటూ ప్రోత్సహించా. అలాంటి అమ్మాయితో హీరోయిన్ గా చేయటం సాధ్యం కాదన్నారు. తాను కృతిశెట్టిని కూతురుగా భావించినట్లు ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో ఇంత ఎమోషనల్ గా ఉండే నటులు తక్కువగా ఉంటారని చెప్పక తప్పదు.