రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎటు చూసినా వరద నీరే కనిపించడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. భారీ పంట నష్టం, ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు.
రెండు రాష్ట్రాల్లో వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. సహాయ చర్యల నిమిత్తం తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు పంపినట్లు వెంకయ్య నాయుడు మీడియాలో వెల్లడించారు. అలాగే ఆయన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ కూడా రెండు రాష్ట్రాలకు రూ. 2.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు.
కుండ పోత వర్షాలు ఏపీ మరియు తెలంగాణను వణికించడం పట్ల వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీకి ఫోన్ చేసి రెండు రాష్ట్రాల ప్రస్తుత పరిస్థితిని వివరించి.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. అలాగే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధుతలకు అండగా నిలవాలంటూ స్వచ్ఛంద సంస్థలకు వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.