నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబోలో తెరకెక్కిన వీర సింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని సెంటర్ల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫస్ట్ షో తోనే బంపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న వీర సింహారెడ్డి వీర లెవల్లో కలెక్షన్లను రాబడుతూ సంక్రాంతి బరిలో అగ్రస్థానంలో నిలిచింది.
బాలయ్యకున్న సంక్రాంతి సెంటిమెంట్ నిజం చేస్తూ ఈ చిత్రం హిట్ కొట్టింది. దీంతో, తాజాగా చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే వీర సింహారెడ్డి చిత్రం గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చేయబోయే సినిమా దానికి దగ్గరగా ఉండే విధంగా చేయాలనుకున్నానని, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నానని బాలయ్య చెప్పారు.
ఆ సమయంలో గోపీచంద్ కథ వినిపించారని, ఈ రోజున ప్రేక్షకులు దాన్ని ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని బాలయ్య అన్నారు. దర్శకుడిగా తనకు కావాల్సిన ఔట్ పుట్ రాబట్టడంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడని, నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీశారని కితాబిచ్చారు. భైరవ ద్వీపం సినిమాలో తన కురూపి పాత్రను సీక్రెట్ గా ఉంచామని, అదే తరహాలో ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తన చెల్లెలి పాత్రలో నటించిన విషయాన్ని సీక్రెట్ గా ఉంచామని అన్నారు.
ఆడియన్స్ థ్రిల్ కావాలని అలా చేశామని బాలయ్య చెప్పారు. వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. ఈ సంక్రాంతికి తన సినిమా ప్రేక్షకులకు విందు భోజనం అయినందుకు సంతోషంగా ఉందని బాలయ్య అన్నారు.