ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంకా న్యాయం కోసం ఎదురు చూడాల్సి రావడంపై వైఎస్ సునీతా రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో జాప్యం గురించి సీఎం జగన్ నే అడగాలంటూ సునీత చెప్పడం జాతీయ మీడియాలోనూ హైలైట్ అయింది.
ఈ నేపథ్యంలో జగన్ పై, వైసీపీ నేతలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. “ఏ2 దొంగ రెడ్డీ… బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా?” అంటూ ఎద్దేవా చేశారు.
ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా అని అయ్యన్న ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచామని కాలర్ ఎగరేస్తున్న ఏ1,1000 మంది పోలీసుల కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నారని, జనాన్ని చూసి జగన్ ఎలా వణుకుతున్నాడో చెప్పడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. సీబీఐ వాళ్లు వస్తున్నారని, హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ అంటూ విజయసాయికి అయ్యన్న చురకలంటించారు.
హస్తినాపురి వీధుల్లో సోదరి సునీత ఆర్తనాదాలు సీఎం జగన్ కు వినిపించడం లేదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ ఈ రోజు ఖాళీగానే ఉన్నారని, తన మీడియా సమావేశాన్ని చూస్తున్నారేమోనని అన్నారు. షర్మిలతో జగన్ కు సఖ్యత చెడిందని, విజయమ్మతోనూ సరైన సంబంధాలు లేవని వింటున్నానని వర్ల రామయ్య అన్నారు.
నిన్న సునీత ఢిల్లీలో దీనంగా మాట్లాడిన తీరు చూసి కరడుగట్టిన కర్కశ హృదయాలు సైతం కరిగి నీరవ్వాల్సిందేనని, కానీ, జగన్ హృదయం కరగడంలేదా అని ప్రశ్నించారు. వివేకాను చంపిందెవరో జగన్ కు తెలుసని ఆయన చెల్లే అంటోందని, ఆ రహస్యం జగన్ కు తెలుసని తనకూ తెలుసని వర్ల రామయ్య షాకింగ్ కామెంట్లు చేశారు.
అందుకే సీబీఐ ఎంక్వైరీ కోరారని, కానీ, అసలు దోషులు పట్టుబడకూడదని ఆ తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై కూడా బురదజల్లాలని చూసి వెనక్కు తగ్గడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ రాజకోట రహస్యాన్ని బహిర్గతం చేయాల్సింది జగన్ అని, వివేకాను చంపింది ఎవరో జగన్ కు తెలుసని అందరూ నమ్ముతున్నారని వర్ల రామయ్య చెప్పారు. సునీత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము జగన్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
పరిటాల రవి ఉదంతంలో సాక్షులను, ముద్దాయిలను చంపినట్టుగా ఈ కేసులోనూ జరుగుతోందని ఆరోపించారు. సాక్షులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు. సునీతారెడ్డి ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయని, ఈ కేసులో రహస్యం వెల్లడైతే ప్రభుత్వమే కూలుతుందని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.