ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు జనాలు కరోనాతో హడలి పోతున్న విష యం తెలిసిందే. ఇక, ఈ వైరస్ తమను ఎక్కడ చుట్టుకుంటుందో అనే బెంగతో చాలా మంది ముందుగానే దీని నుంచి రక్షణ పొందేందుకు.. అదే సీఎం జగన్ చెప్పినట్టు `వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి రక్షణ` అనే మంత్రాన్ని పఠిస్తున్నారు. ఈ క్రమంలోనే తిండినీళ్లు కూడా వదిలేసి.. వ్యాక్సిన్ ఎక్కడిస్తారు మహప్రభో అంటూ.. వ్యాక్సిన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
వ్యాక్సిన్ ఇచ్చే వరకు ఎంత సేపైనా పడిగాపులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు.. ఇలా .. అన్ని వర్గాలకు చెందిన 45 ఏళ్లు పైబడిన వారు.. ఏపీలో వ్యాక్సిన్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా మృతుల సంఖ్య 100కు చేరువలో ఉండడం(93-96-92-92 ఇలా వరుసగా మృతుల సం ఖ్య ఉంటోంది)తో మరింత బెంబేలెత్తుతున్నారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకుంటే.. కొంతవరకైనా మహ మ్మారి నుంచి రక్షణ దక్కుతుందని భావిస్తున్నారు.
అయితే.. అనూహ్యంగా జగన్ ప్రభుత్వం సోమ,మంగళవారాల్లో వ్యాక్సిన్ ఇవ్వరాదని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ మార్పులపై అధికారులు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో 3.5 లక్షల టీకా డోసులు అందుబాటు లో ఉండగా.. రెండో డోసు వారికే టీకా వేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు అధికారులు ప్రయత్నం మొదలుపెట్టారని సర్కారు ప్రకటించింది.
అంతేకాదు, ఎవరికి, ఎప్పుడు టీకా ఇస్తారనే వివరాలతో ఇంటి వద్దకే స్లిప్పుల పంపిణీ చేయనున్నారని సమాచారం. టోకెన్ల పంపిణీ పూర్తయ్యాకే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తయి.. తిరిగి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెండు రోజులు పడుతుందని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం నాలుగు రోజులు పడుతుందని అధికారులు చెబుతుండడం గమనార్హం. మరి ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఎంత మంది కరోనా బారిన పడతారోనని.. ఆందోళన వ్యక్తమవుతోంది