ఏ ముహుర్తంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారో కానీ.. ఏదో ఒక మాటతో అదే పనిగా వార్తల్లో నిలుస్తున్నారు బీజేపీ నేత కమ్ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్. ఇప్పటికే రిప్డ్ జీన్స్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా అమెరికా వారు ఇండియాను 200 ఏళ్లు పాలించారన్న వ్యాఖ్య చేసిన అభాసుపాలయ్యారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా చేస్తున్న ఆయన వ్యాఖ్యలు రేపుతున్న కలకలం బీజేపీ నేతలు తలలు పట్టుకునే పరిస్థితి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నోరు విప్పితే ఏం జరుగుుతుందోనని.. భయపడే వరకు విషయం వెళ్లిందంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు చేసిన రెండు వ్యాఖ్యలకు మించిన రీతిలో ఆయన తాజా వ్యాఖ్య ఉండటమే. ప్రభుత్వం అందించే రేషన్ ఎక్కువ అందాలంటే.. ఎక్కువమంది పిల్లల్ని కనాలన్నారు. ఆహారధాన్యాలు.. పప్పు ధాన్యాలు పంపిణీ చేసే కేంద్రం నుంచి ఎక్కువ లబ్థి పొందాలంటే.. ఎక్కువ మందిని కనాలంటూ బాధ్యత లేకుండా వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు పిల్లలు ఉన్న వారెందుకు ఆసూయపడుతారు? అన్న ఆయన.. ‘‘ఇద్దరు పిల్లలతో నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఇరవై కేజీల సరకులు అందుతున్నాయి. 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరకులు అందుతున్నాయి. ఎక్కువ సరుకులు అందుతున్న వారిని చూసి చిన్న కుటుంబాల వారు ఆసూయ చెందుతున్నారు. ఇద్దరు పిల్లల్ని కని ఆపేయటం ఎందుకు? 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదు?’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
చూస్తుంటే.. మోడీషాలలో ఎవరో ఒకరు కలుగజేసుకొని కంట్రోల్ చేసే లోపు మరెన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో ఏమో? తాజాగా ఆయన దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. నాలుగు రోజుల పాటు ఉండే ఆయన.. ప్రధాని మోడీని కలిసే వీలుందని చెబుతున్నారు.