సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులు ఫిర్యాదు లేదా దరఖాస్తు చేస్తే ఎంత ఉంటుంది మహా అంటే ఒకటి లేదా రెండు మూడు పేజీలకు మించి ఉండదు. కానీ ఒక రైతు ఏకంగా 12 కేజీల బరువైన ఫిర్యాదు పత్రం మూఠను నెత్తిన మోసుకుని వచ్చి అధికారుల ముందుంచడటంతో అవాక్కవడం అధికారుల వంతైంది. దేశం మొత్తం విస్తుపోయేలా చేసిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా ఢాకూ బీబీవలి గ్రామంలోని రైతు చరణ్‌సింగ్ తన సమస్య పరిష్కరించమని ఆరు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తి పోయాడు. చివరకు చేయగలిగేదేమీ లేక ఆరు సంవత్సరాలుగా తాను చేసుకున్న దరఖాస్తులు ఫిర్యాదుల మూటను నెత్తిన పెట్టుకుని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ముందుకు వచ్చి నిలుచోవడంతో అక్కడి అధికారులు అవాక్కయ్యారు.
చరణ్ సింగ్‌కు తన గ్రామంలో ఉన్న పొలాన్ని ఆక్రమణల పేరిట అక్కడి గ్రామాధికారులు తాసీల్దార్ అనుమతితో లాగేసుకున్నారు. అప్పటి నుంచీ తన పొలం కోసం ఆ రైతు ఆరేళ్లుగా అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఈ ఆరేళ్లలో ఆ రైతు ఏకంగా 211 సార్లు ఫిర్యాదు చేసి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే అధికారులు ఏమాత్రం కనికరం చూపకుండా ఆ రైతును ఆఫీసుల చుట్టూ తిప్పి పంపుతున్నారు.
చివరకు ఆ రైతు తాను పెట్టకున్న దరఖాస్తుల మొత్తాన్ని ఒక మూఠగా కట్టి వాటిని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ దరఖాస్తుల మూఠ బరువు మొత్తం 12 కేజీలుంది. ఇది మీడియా కంట పడటంతో ఆ రైతు బరువైన ఫిర్యాదు మూఠ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో అధికారులు ఆ రైతు సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించారు.
తన గ్రామాధికారి అన్యాయంగా తన భూమిని లాగేసుకున్నారని ఆ రైతు ఆరోపించారు. తన భూమి కోసం ఆ రైతు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తన పొలంలో తాను 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాని తన పొలం ఎలా ఆక్రమణ కింద చూపెడతారని రైతు వాపోతున్నారు. తనకున్న జీవనాధారం ఆ పొలం మాత్రమేనని వాపోయారు.