మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో రగిలిన చిచ్చు రోజురోజుకూ పెచ్చు మీరుతోందే తప్ప ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించట్లేదు. పవన్ మాటలను ఇండస్ట్రీలో కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు అస్సలు ఆయన మాటలే పట్టించుకోవట్లేదు.
ఇంకొందరైతే బాబోయ్.. పవన్ మాటలకు ఇండస్ట్రీకి అస్సలు సంబంధమే లేదన్నట్లు తేల్చి చెప్పేశారు. ఇంత తతంగం జరిగిన తర్వాత కొందరు ఇండస్ట్రీ బడా నిర్మాతలు కొందరు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ కావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
నానితో భేటీ ముగిసిన అనంతరం మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండే నిర్మాతలు కొందరు పవన్‌తో భేటీ కావడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో.. అటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం నాడు నిర్మాతలు దిల్‌రాజు, దానయ్య, బన్ని వాసు, పవన్ భేటీ అయ్యి.. సుమారు రెండు గంటల పాటు కీలక విషయాలపై చర్చించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై రగడ జరుగుతోంది. త్వరలోనే ఆన్లైన్ టికెట్ల వ్యవహారానికి పరిష్కారం లభిస్తుందని నిర్మాతలు, చిత్ర పరిశ్రమ ఎదరుచూస్తోంది. ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మంత్రి పేర్ని నానితో చర్చలు జరపడం.. ఇప్పుడు మళ్లీ నిర్మాతలు పవన్‌తో భేటీ కావడంతో అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలియక కొందరు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆందోళన చెందుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. మంత్రి నానితో భేటీ సమయంలో నిర్మాతలతో పాటు బన్నీ వాసు కూడా ఉన్నారు. ఈయన మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అంతేకాదు.. కనీసం కెమెరాల కంట పడకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ చర్చలు ముగిసిన తర్వాత ఇక్కడ పవన్‌తో భేటీ కావడం గమనార్హం.