వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు రెడీ అయ్యారు. పోటీకి సిద్దమని ప్రకటిస్తున్నారు. మరికొంద రు.. ఏకంగా టికెట్ తమదేనని భావిస్తున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నాయకుల ఆశలు తారస్థాయికి చేరాయి. ఇందులో మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. కొన్ని చోట్ల కొందరిని గతంలోనే చంద్రబాబు ఎంపిక చేసి మరీ.. టికెట్లు ఇస్తామని ప్రకటించి.. వారితో పనులు చేయించుకున్నారు. వీరు కూడా.. పార్టీపైనా.. చంద్రబాబు పైనా నమ్మకం పెట్టుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు రాజకీయాలు మారాయి. వ్యూహాలు మారాయి. పార్టీల మధ్య పోటీ మరింత పెరిగింది. దీంతో టికెట్ చిక్కని వారు.. గెలుపు గుర్రాలు అనుకున్నవారు. పొరుగు పార్టీల నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారు. వీరికివైసీపీలో చోటు దక్కకే.. టీడీపీ బాట పట్టారు. వీరిలో కొందరికిపార్టీ టికెట్‌ను నిరాకరించినా.. మరికొందరికి మాత్రం టికెట్ ఇవ్వక తప్పని పరిస్తితి ఉంది. ఇలాంటి వారితో.. ఇప్పటికే టికెట్ పై ఆశలు పెట్టుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టిన నాయకులు తర్జన భర్జనకు గురవుతున్నారు.
ఉదాహరణకు.. చీరాల అసెంబ్లీని గతంలోనే ఒక నాయకుడికి అప్పగించారు. దీంతో ఆయన పార్టీ కార్య క్రమాలు చురుగ్గానే సాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది. ఇక, నరసరావుపేట ఎంపీ నియోజకవర్గంలోనూ.. ఇదే తరహా మార్పులు చేశారు. కడియాల వెంకటేశ్వరరావు అనే డాక్టర్‌కు ఇక్కడి టికెట్ ఇస్తామన్నారు. దీంతో ఆయన పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. కానీ, ఎన్నికల సమయం వచ్చే సరికి ఇక్కడ కూడా ఈక్వేషన్ మారిపోయింది.
ఇలా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్తితి అనూహ్యంగా మారిపోవడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారు? వీరిని ఎలా సర్దుబాటు చేస్తారు? అనేది నరాలు తెగే ఉత్కంఠకు దారి తీస్తోంది. మరోవైపు.. జనసేనతో ఉన్న పొత్తుల కారణంగా.. కొన్ని నియోజకవర్గాలను వదులు కోవాల్సి ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెట్టున్న వారు కూడా.. బాబు నిర్ణయం పై ఉత్కంఠగానే ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు తీసుకునే నిర్ణయం.. వివాదాలకు దారితీయకుండా ఉంటే అదే పెద్ద గెలుపు .. అనే భావన వ్యక్తమవుతుండడం గమనార్హం.