పశ్చిమెబెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి మమత బెనర్జీ అధికారం చేపట్టిన వెంటనే మొదలైన రాజకీయ పరిణామాలతో అట్టుడికిపోతోంది. అప్పుడెప్పుడో నారదా స్కాంలో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో ఇపుడు ఇద్దరు మంత్రులు, ఒక ఎంఎల్ఏతో పాటు మరో సీనీయర్ నేతను సోమవారం ఉదయం సీబీఐ అరెస్టుచేసింది. అసలే కేంద్రప్రభుత్వానికి, మమతకు ఏమాత్రం పడటంలేదు. దానికితోడు బెంగాల్లో మమతను ఎలాగైనా ఓడించాలని నరేంద్రమోడి, అమిత్ షా శతవిధాల ప్రయత్నించి ఫెయిలయ్యారు.
ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కూడా వీళ్ళద్దరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని మమత సాధించిన విజయం అపూర్వమనే చెప్పాలి. దాంతో మమతపై కేంద్రప్రభుత్వంలోని పెద్దలకు బాగా మంటగా ఉందని తెలిసిపోతోంది. దీని పర్యవసానమే ఫలితాలు వచ్చిన మరుసటిరోజే అల్లర్ల రూపంలో బయటపడింది. తృణమూల్-బీజేపీ నేతల్లో ఎవరు ఎవరిపై దాడులు చేశారో తెలీకపోయినా చాలామంది అధికార పార్టీ నేతలపై కేంద్రం కేసులు పెట్టింది.
ఈ సమస్య ఇలా ఉండగానే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజులకే ఇద్దరు మంత్రులు, ఓ ఎంఎల్ఏ+సీనియర్ నేతను సీబీఐ అరెస్టు చేయటం సంచలనంగా మారింది. వీళ్ళపై దర్యాప్తుకు ఈనెల 7వ తేదీనే గవర్నర్ జగదీప్ ధన్ కర్ సీబీఐకి అనుమతివ్వటం ఇపుడు కలకలం రేపుతోంది. ఎందుకంటే గవర్నర్ ఇచ్చిన అనుమతి ప్రభుత్వానికి ఏమాత్రం తెలీదు. అంటే మమతకు కనీసం చెప్పకుండానే మంత్రులపై చర్యలకు గవర్నర్ అనుమతివ్వటం ఇపుడు వివాదం అవుతోంది.
మంత్రుల అరెస్టుకు నిరసనగా మమత సీబీఐ కార్యాలయం దగ్గర సుమారు 7 గంటల పాటు ధర్నా చేయటం సంచలనమైంది. ఓ ముఖ్యమంత్రి సీబీఐ ఆఫీసు ముందు ధర్నా చేయటం బహుశా దేశం మొత్తంమీద ఇదే మొదటిసారేమో. మంత్రులను అరెస్టు చేసిన సీబీఐ వాళ్ళని కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ ఇచ్చిందనుకోండి అదివేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గవర్నర్ ను ముందుపెట్టుకుని కేంద్రంప్రభుత్వం పెద్దలు మమతను ఓ ఆట ఆడిద్దామని అనుకుంటున్నట్లున్న విషయం తెలిసిపోతోంది.
అయితే మమత గురించి అందరికీ తెలిసిందే. ఓ పట్టాన ఎవరికీ మమత లొంగేరకం కాదు. మమతను ఎన్నికల్లో ఓడించలేని కేంద్రంలోని పెద్దలు అవే ప్రయత్నాలను పదే పదే ఏదోరూపంలో చేస్తునే ఉంటారు. వెనక్కు తగ్గకుండా వాళ్ళని మమత కూడా ప్రతిఘటిస్తునే ఉంటుంది. దీని ఫలితంగా బెంగాల్లో రాజకీయంగా ఎప్పుడూ ఏదో రచ్చ జరుగుతునే ఉంటుందని అర్ధమైపోతోంది. ముందు ముందు బెంగాల్ రాజకీయం దేశాన్ని ఇంకెత వేడెకించేస్తుందో చూడాల్సిందే.