తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్.. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్, బీజేపీ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహుల నుంచి ఈ రెండు పార్టీలు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు నాయకుల జంపింగ్‌లు, చేరికలతో పొలిటికల్ హడావుడి కొనసాగుతోంది. కానీ ఇప్పుడు అసలు తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు? అనే ప్రశ్న మొదలైంది. అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తారని, మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. కానీ ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం లేదనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం ముందుగానే సిద్ధమైన బీఆర్ఎస్.. ఎప్పటికప్పుడూ పరిస్థితులు అంచనా వేస్తూ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని టాక్. చివరగా 2018 డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 11న ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలంటే అక్టోబర్ 5 నుంచి 10 తేదీలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాలి. కానీ మరోవైపు జమిలీ ఎన్నికలపై నివేదిక కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి ఆరు నెలల సమయమిచ్చింది.
అయితే అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం చేయకుండా మోదీ మరోసారి ఎన్నికలకు వెళ్లరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 22నే ప్రారంభోత్సవం చేసిన వెంటనే కూడా ఎన్నికలు వెళ్లే ఆస్కారం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్నది టాక్. అంతే కాకుండా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమనే టాక్ కూడా ఉంది. దీంతో ఒకేసారి పార్లమెంట్ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేలా చేయాలన్నది మోదీ ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు. అలా వీలు కానీ పక్షంలో ఏప్రిల్, మే వరకు అయిదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఆస్కారముంది.