ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తేనే వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారంటూ జగన్ ప్రతిపక్ష నేతగా సన్నాయి నొక్కులు నొక్కారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ సరిగ్గా సమయానికి వచ్చేట్టు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు… జీతాల కోసం ధర్నాలు చేస్తూ రెట్టించిన నిరుత్సాహంతో పనిచేస్తున్నారు.
జగన్ దయ వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అమ్మో ఒకటో తారీకు అనే పరిస్థితికి వచ్చారు. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లను గంట కొట్టినట్లు ఒకటో తేదీన టంచన్ గా తప్పకుండా జీతాలు, పెన్షన్లు వారి వారి ఖాతాలలో జమ అయ్యేవి. కానీ, జగన్ వచ్చిన తర్వాత మాత్రం కనీసం ఐదో తారీకు…లేదంటే పదో తారీకు దాటితే గాని జీతాలు పడట్లేదు. ఈ వ్యవహారంపై ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు ,ఉపాధ్యాయులు, పెన్షనర్లు పలుమార్లు నిరసనలు, ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
అంతేకాదుచ నిరసనలు చేస్తే నోటీసులు ఇవ్వడం, ఆందోళన చేస్తే కక్ష సాధించడం వంటి చర్యలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 13వ తేదీ వచ్చినా సరే నవంబర్ నెల జీతాలు పడలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద వేతనాలు చెల్లించాలంటూ ఏపీటీఎఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేసిన వైనం చర్చనీయాంశమైంది. ధర్నాకు దిగితే ఉపాధ్యాయులకు నోటీసులు ఇస్తున్నారని, ధర్నాలు చేస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
అయినా, జీతాల కోసం ఆందోళన చేసే ప్రజాస్వామ్యం ఏపీలో మాత్రమే ఉందని అంటున్నారు. ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం కాదని, అవసరమైతే కాళ్లు పట్టుకొని అడుక్కోవాలని బొత్స వ్యాఖ్యానించడంపై కూడా వారు మండిపడుతున్నారు.