టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా పర్యటన ఆద్యంతం చంద్రబాబుకు టిడిపి కార్యకర్తలు, నేతలతో పాటు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడం ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడికి తెరతీసింది. చంద్రబాబు ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగింది మొదలు…తిరిగి కర్నూల్ నుంచి బయలుదేరే వరకు అశేష ప్రజానీకం సైకిల్ గుర్తుకు, చంద్రబాబుకు నీరాజనాలు పలికింది.
రండిరా చూసుకుందాం… వైసిపి కార్యకర్తలను బట్టలిప్పించి కొడతా…అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఆ స్పీచ్ తర్వాత ఇప్పటినుంచి ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్న రీతిలో తెలుగు తమ్ముళ్లు కొత్త ఊపుతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటన సందర్భంగా చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు వచ్చిన జనాన్ని చూసి టిడిపి అధిష్టానం మదిలో కొత్త ఆలోచన మొదలైందట.
ఇప్పటిదాకా జనసేనతో లేదా బిజెపితో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని భావించిన టిడిపి రాబోయే ఎన్నికల బరిలో సోలోగా దిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడిందట. చంద్రబాబు పర్యటనలకు వచ్చిన ప్రజాదరణ చూసి సింగిల్ గానే పోటీ చేస్తే బాగుంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారట. దానికి తోడు మిత్ర ధర్మంతో పొత్తు వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 40 నుంచి 50 సీట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని, అది కూడా టిడిపికి గట్టి పట్టున్న అసెంబ్లీ స్థానాలను పవన్ కోరుతున్నారని టాక్ వస్తోంది.
అంతేకాదు, ఈసారి మీరు తగ్గండి అంటూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే తనకు సీఎం పదవిని వదిలేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు కారణాలు కూడా చాలామంది టిడిపి నేతలకు మింగుడు పడడంలేదు. అయితే, ఇప్పుడు తాజాగా చంద్రబాబు పర్యటనలకు వచ్చిన స్పందన చూసి వారంతా మనసు మార్చుకుని టిడిపి సింగిల్ గా పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబుతో అంటున్నారట.
ప్రధాని మోడీ విశాఖ టూర్ సందర్భంగా మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పవన్ డబల్ గేమ్ ఆడుతున్నారని, అవకాశం ఎటుంటే అటు గాలివాటంగా, గోడమీద పిల్లిలాగా పవన్ మారారని చాలామంది టిడిపి నేతలు అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో టిడిపి సింగిల్ గా పోటీ చేస్తేనే మంచిదన్న భావనలో చంద్రబాబు కూడా ఉన్నారట. అయితే ఈ విషయంపై చంద్రబాబు మిగతా టిడిపి నేతలతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రాబోతున్నది తెలుస్తోంది.