ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు టీడీపీ నుంచి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా శనివారం పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటించారు. మొదటిరోజు గొల్లప్రోలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నాగబాబు చేశారు. జనసేన, టీడీపీ శ్రేణులతో నియోజకవర్గంలో నాగబాబు మొదటి రోజు పర్యటన అద్భుతంగా సాగింది. నాగబాబుకు ఘన స్వాగతం లభించింది. కానీ, రెండో రోజు మాత్రం తేడా కొట్టింది.
నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో రగడ మొదలైంది. పవన్ కళ్యాణ్ కోసం పఠిపురం సీటును త్యాగం చేసిన వర్మను జనసేన పక్కన పెట్టేయడం టీడీపీ శ్రేణులు సహించలేకపోయారు. పిఠాపురం మండలం కుమారపురంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకు భారీ బందోబస్తుతో నాగాబాబు రాగా.. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన్ను చుట్టుముట్టి జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ పరిణామంతో పిఠాపురం కూటమిలో చిచ్చు మొదలైందని చర్చించుకుంటున్నారు. గత కొంత కాలం నుంచి జనసేన, వర్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్నది ఓపెన్ సీక్రెట్. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేయడమే కాకుండా ఆయన గెలుపులో వర్మ కీలక పాత్రను పోషించారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వర్మకు జనసేన నుంచి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. పైగా ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు పరోక్షంగా వర్మను టార్గెట్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపుకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ వర్మను ఉద్ధేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి.
అప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు నాగబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా టీడీపీ భాగస్వామ్యం లేకుండా, వర్మను ఆహ్వానించకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఇన్నాళ్లు పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య సో సోగా ఉన్న గొడవలు.. నాగబాబు రాకతో తారా స్థాయికి చేరుకున్నాయని అంటున్నారు.