సీఎం జగన్ పాలనలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సంగతి తెలిసిందే. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, పోలీసులు కూడా శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా గన్ మెన్ ఇవ్వడం లేదని, తనకు ఏం జరిగినా సీఎం జగన్ దే బాధ్యత అని బీటెక్ రవి షాకింగ్ కామెంట్లు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పుందని, ప్రభుత్వం గన్మెన్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ నాలుగు వాహనాల్లో కొందరు తనను వెంబడిస్తున్నారని బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు కడప జిల్లాలో దుమారం రేపుతున్నాయి.
కాగా, కొద్ది రోజుల క్రితం బీటెక్ రవిని ఏపీ పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘చలో పులివెందుల’ కార్యక్రమం నేపథ్యంలో బీటెక్ రవి, మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు…రవిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ హత్య విషయంలో న్యాయం జరగలేదంటూ టీడీపీ ‘చలో పులివెందుల’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, నాగమ్మ హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేశారని నాగమ్మ కుటుంబ సభ్యులు చెప్పారు. టీడీపీ నేతలు తమ పరువుకు భంగం కలిగించేలా ర్యాలీ నిర్వహించారని వారు ఆరోపించారు. హత్యాచారానికి గురైన దళిత మహిళ తల్లి ఫిర్యాదుతో పోలీసులు బీటెక్ రవి సహా 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసులో అరెస్టయి విడుదలైన రవి…. తాజాగా తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.