సర్వే చెప్పిన కొత్త విషయం: అమెరికాలో మనోళ్లు ఎంత సంపాదిస్తారు?

యాభై ఏళ్ల క్రితం అమెరికా మనకు చాలా దూరం. పాతికేళ్లకు ఇదెంతో తగ్గింది. కానీ.. పదేళ్ల క్రితం దూరం మరింత తగ్గటమే కాదు.. ప్రతిఊరిలో కనీసం పాతిక నుంచి యాభై మంది అమెరికాలో స్థిరపడినోళ్లు ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే.. అమెరికాలో మనోళ్లు పాగా వేయటం.. అక్కడ ఉద్యోగాలు.. వ్యాపారాలు చేయటం ఎక్కువైందో.. మన లోగిళ్లు కూడా కాసుల కళకళలాడే పరిస్థితి. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది అమెరికాలో ఉన్న పరిస్థితి. మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ప్రభావం ఎంతన్న విషయం అందరికి తెలిసిందే. భారత మూలాలు ఉన్న మహిళ ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష మహిళగా ఎన్నిక కావటం చూస్తే.. అమెరికాలో మనోళ్ల స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతకీ అమెరికా మీద మనోళ్లకు ఎందుకంత మోజు? అక్కడకు వెళ్లినోళ్లు నెలకు ఎంత సంపాదిస్తారు? ఏడాదికి ఎంత వెనుక వేస్తారు? లాంటి సందేహాలు మామూలే. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పింది తాజాగా నిర్వహించిన సర్వే.

నేషనల్ కొయలిషన్ ఫర్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులోని వివరాలు ఆసక్తికరంగానే కాదు.. భారతీయ అమెరికన్ల సంపాదన ఎంతన్న విషయాన్ని వెల్లడించింది. అమెరికాలోని భారత  అమెరికన్ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 1.20లక్షల అమెరికా డాలర్లుగా తేల్చారు. మన రూపాయిల్లో చూసినప్పుడు రూ.87లక్షలుగా చెప్పాలి. ఇది అమెరికన్లు.. ఇతర వర్గాల సగటు ఆదాయం కంటే ఇది ఎక్కువ కావటం గమనార్హం. బర్మీస్ కుటుంబాల వార్షిక ఆదాయం 45,348 డాలర్లు కాగా.. నల్ల జాతీయులది 41,511 డాలర్లు. లాటిన్స్ కుటుంబాల సగటు ఆదాయం 51,404 డాలర్లుగా పేర్కొన్నారు. ఇదెలా అన్న విషయాన్ని సదరు నివేదిక వెల్లడించింది. గతంలో హెచ్ 1 బీ వీసాతో అగ్రరాజ్యానికి వచ్చిన వారి కుటుంబాల్లో వీసా ఉన్న వారు మాత్రమే ఉద్యోగం చేసుకునే వీలుండేది. ఎప్పుడైతే ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. హెచ్ 1బీ వీసాతో వచ్చే వారి కుటుంబ సభ్యులకు పని అనుమతులు కల్పించారు. ఇది వలసదారుల కుటుంబాలకు ఆర్థికంగా భారీ ఉపశమనాన్ని కలిగించింది. ఇదే.. భారత అమెరికన్ల ఆదాయం పెరగటానికి కారణమని చెప్పొచ్చు. దీనికి తోడు.. కష్టపడి పని చేసే తత్త్వం కూడా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించటానికి మరో కారణంగా చెబుతున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.