సీఎం జగన్ వీడియోలను మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ మాటలను ఉమ వక్రీకరించారని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ట్విట్టర్ లో దేవినేని ఉమ పోస్ట్ చేసిన వీడియో నకిలీదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలిందంటూ సీఐడీకీ ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
దీంతో ఉమపై 464, 465, 468, 471, 505 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసంలో అధికారులు నోటీసులు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కర్నూలులోని తమ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలంటూ ఈ ఉదయం 10.20కి ఉమకు నోటీసులివ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ నోటీసులపై ఉమ స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తాను నెల్లూరులో ప్రచారంలో ఉన్నానని తెలిపారు. కోవిడ్ సంరక్షణ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి తనకు 10 రోజులు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కర్నూలు డీఎస్పీ సీఐడీ రవికుమార్‌కు లేఖ పంపారు.
ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న దేవినేని ఉమ….నోటీసులిచ్చిన 10 నిమిషాల్లో కర్నూలు సీఐడీ ఆఫీసులో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. సీఐడీ నోటీసు కక్షపూరితంగా ఉందని ఎద్దేవా చేసింది. నెల్లూరులో ఉన్న మనిషికి విజయవాడలో నోటీసులిచ్చారని తెలియడానికే 10 నిమిషాలు పడుతుందని అన్నారు.
అటువంటి సమయంలో 10 నిమిషాల్లో కర్నూలుకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులివ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపుకు కూడా ఒక హద్దూపద్దూ ఉండాలని టీడీపీ నేతలు చురకలంటిస్తున్నారు. జగన్ వైఫల్యాలను దేవినేని ఉమ ఎండగడుతున్నారని, అందుకే, ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.