వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి చేరబోతున్నారా? ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల టూర్లో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమె తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇటీవల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఆమె క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ సస్పెండ్ చేసింది.
మరోవైపు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్‌పై వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో శ్రీదేవి ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు టీడీపీలోకి చేరేందుకు ఆమె మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే స్థానిక టీడీపీ నేతలోనూ ఆమె చర్చలు జరిపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే టీడీపీలో కూడా స్థానికంగా శ్రీదేవికి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌తో శ్రీదేవికి పోటీ తప్పకపోవచ్చన్నది వాదన. అయినప్పటికీ చంద్రబాబును కలిసి ఓ స్పష్టతకు రావాలన్నది శ్రీదేవి ఆలోచనగా తెలుస్తోంది. అందుకే భర్త శ్రీధర్‌తో కలిసి బాబుతో సమావేశం కావాలని శ్రీదేవి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె టీడీపీలోకి వస్తే తాడికొండ ఇంఛార్జీగా ఉన్న శ్రవణ్ అభ్యంతరం తెలిపే అవకాశముంది. దీంతో శ్రీదేవిని ఎమ్మెల్సీ చేస్తామనే హామీ ఇవ్వడమో లేదా శ్రవణ్‌ను బుజ్జగించి ఆమెను ఎమ్మెల్యేగా నిలబెట్టడమో? ఈ రెండింట్లో బాబు ఏం చేస్తారన్నది చూడాలి.