ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు విషయాలను పార్లమెంటులోపల, బయట కూడా ఎండగడతామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వెలుపల ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు.. కింజరాపు రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ సహా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారన్నారు. ఇది అక్రమ అరెస్టు అని తాము భావిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై కోర్టులకు వెళుతున్నామని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో కేంద్ర ప్రభుత్వం గమనించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు, జైలు విషయాలను పార్లమెంటు లోపల, బయట కూడా లేవనెత్తడానికి సాధ్యమైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి తాము ప్రయత్నిస్తామని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు, జైలులో వేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని.. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబును అరెస్టు చేసిందని, ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని గల్లా జయదేవ్ అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని తెలిపారు. వైసీపీ రాజకీయ కుట్రలు, కక్ష సాధింపు చర్యలను పార్లమెంటు ఇంటా, బయటా ప్రశ్నిస్తామన్నారు.