రాబోయే ఎన్నికల్లో ఏఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి? అన్న విషయం ఇపుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏలో టీడీపీ చేరబోందంటూ జాతీయ స్థాయిలో కథనాలు వస్తుండగా…సరైన సమయం చూసి పొత్తులపై నిర్ణయం ఉంటుందని చంద్రబాబు తేల్చేశారు. ఇక, టీడీపీతో జత కట్టేందుకు జనసేన సుముఖంగానే ఉన్నా..సీఎం పదవి తనకొదిలేయాలంటూ పవన్ చెప్పడంతో టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు.
వైసీపీకి పొత్తుల ఆలోచనలేదుగనక ఆ పార్టీని మినహాయిస్తే…ఏపీలో టీడీపీ-బీజేపీ, టీడీపీ-జనసేన, బీజేపీ-జనసేన, టీడీపీ-బీజేపీ-జనసేనల పొత్తులకు సంభావ్యత ఉంది. అయితే, పొత్తులపై ఆయా పార్టీల అధినేతల అభిప్రాయాలు మాత్రమే ఇప్పటివరకు వెల్లడయ్యాయి. అయితే, అసలు పొత్తుల గురించి కార్యకర్తలు ఏమనుకుంటున్నారన్న దానిపై తాజాగా చర్చ మొదలైంది. ముఖ్యంగా, వేరే పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఎక్కువ మంది తెలుగుతమ్ముళ్లకు మింగుడు పడడం లేదట.
పొత్తులు వద్దని, సింగిల్ గా పోటీ చేద్దామని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల పార్టీకి నష్టమే జరుగుతుందన్నది వారి వాదన. కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంక్ లేని పార్టీతో పొత్తు వల్ల మైనార్టీలు, దళితులు, బీసీల్లో కొన్ని వర్గాలు పార్టీకి దూరమవుతారని వారు అంటున్నారు. జనసేనతో పొత్తు వల్ల కొన్ని నియోజకవర్గాల్లో గెలవొచ్చని, కానీ, జగన్ పై వ్యతిరేకత, టీడీపీ ప్రభుత్వమే రావాలనుకున్న బలమైన ఆకాంక్ష జనంలో ఉంటే ఓట్ల చీలిక అనే సమస్య ఉండదని అంటున్నారు.
టీడీపీకి ఇన్ని సీట్లు ఇస్తామంటూ ఒక్క శాతం ఓటు బ్యాంకులేని బీజేపీ నేతలు ఆఫర్ ఇవ్వడం కూడా తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు. అటువంటి పార్టీతో ఇన్ని మాటలు ఎందుకు పడాలన్నది వారి వాదన. జనసేనతో పొత్తు అనగానే…పవన్ సీఎం కావాలి అంటూ డిమాండ్లు వచ్చాయని, పొత్తు అంటే టీడీపీ మీద మిగతా పార్టీలు స్వారీ చేస్తాయని అంటున్నారు. వైసీపీకి టీడీపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు అనుకునేలా చేస్తే పొత్తులతో సంబంధం లేకుండా గెలిపిస్తారని చెబుతున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఓట్లు చీలుతాయని అనుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకపక్షంగా మద్దతిచ్చారని గుర్తు చేస్తున్నారు.