గత జులై నెలలో ప్రఖ్యాత తెలుగు సంస్థ ‘తానా” లో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల గురించి ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా పేరుతో చాలా విషయాలు తెలియ పరచడం జరిగింది, ఆ ఆర్టికల్ లింక్ ను క్రింద చూడవచ్చు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ఇలా వున్నాయి.
పేస్ బుక్, మీడియా చానెల్స్ లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా వెలువడుతున్న సమాచారాన్ని చూసినా ఇలాగే అర్థమవుతాయి
–> పదుల సంఖ్యలో చిన్న పెద్ద కార్యక్రమాలు, ఏవరెవరివో పేర్లతో, ఎవరెవరివో ఫోటోలతో చాలా జరుగుతున్నట్లే అనిపిస్తున్నాయి కానీ..ఏదో మిస్సవుతోంది
–> అడపా దడపా న్యూయార్క్ టైం స్క్వేర్ వంటి ప్రముఖ ప్రదేశాల్లో తెలంగాణ బతుకమ్మ వంటి పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లే అనిపిస్తున్నాయి కానీ..ఏదో మిస్సవుతోంది
–> నాయకత్వమంతా అట్లాంటలోనే ఉంది అని చెప్పుకుంటూ సుదూర ప్రాంతమయిన ఫిలడెల్ఫియాలో అదీ వచ్చే జులై 4th న కాక, తర్వాత వచ్చే వీకెండ్ జరపుతామంటున్న ‘తానా’ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగున్నాయనే అనిపిస్తున్నాయి కానీ..ఏదో మిస్సవుతోంది
–> వచ్చే ‘తానా’ కాన్ఫరెన్స్ కోసం అవసరమైన దానికంటే రెట్టింపు సొమ్ములు విరాళాల ‘హామీల’ రూపం లో జడివాన కురిసినట్లే అనిపిస్తున్నాయి కానీ..ఏదో మిస్సవుతోంది
–> ఇండియాలో ‘తానా’ చైతన్య స్రవంతి పేరుతో ఎప్పుడూ జరగనన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, వివిధ మీడియాల ద్వారా ఊదర కొడుతున్నది నిజమేనేమో అనిపిస్తున్నాయి కానీ..ఏదో మిస్సవుతోంది
–> ఇప్పటికి నాలుగేళ్ల క్రితం డీసీ లో జరిగిన ‘తానా’ కాన్ఫరెన్స్ లో జరిగిన లెక్కల అవకతవకల ఆరోపణలపై స్పష్టత వచ్చేస్తుందని అనిపిస్తోంది కానీ..ఏదో మిస్సవుతోంది
–> సంస్థ లో ఉన్న మూడు గ్రూపులు వచ్చే ఎన్నికల్లో అధిపత్యం కోసం అనైతికంగా సుమారు 25 కోట్ల స్వంత డబ్బు ఖర్చు పెట్టి చేర్పించిన సభ్యుల ఓటు హక్కు హుళక్కేనని అనిపిస్తోంది కానీ.. ఏదో మిస్సవుతోంది
–> ఎన్నికల్లో గెలుద్దామని పెద్ద ఎత్తున సభ్యుల్ని చేర్పించిన వర్గం ఓటు హక్కు – నైతిక హక్కు అంటూ చెప్పుకుంటూ చేస్తున్న న్యాయ పోరాటంలో ఆల్మోస్ట్ గెలిచారేమో అనిపిస్తోంది కానీ..ఏదో మిస్సవుతోంది
–> ఏదో విధంగా గందరగోళంగా నడిచిన ప్రస్తుత రెండు సంవత్సరాల టర్మ్ చివరి 6 నెలలైనా ఒక నిలకడకు చేరుతుందేమో అనిపిస్తోంది కానీ..ఏదో మిస్సవుతోంది
–> గత దశాబ్దం పైగా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే బందీ అయిన ‘తానా’ సంస్థ నాయకత్వం స్వేచ్ఛగా కొత్త పుంతలు తొక్కబోతుందని అనిపిస్తోంది కానీ..ఏదో మిస్సవుతోంది
పైన వివరించిన వ్యవహారాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా ప్రఖ్యాతమైన ‘పరమానందయ్య శిష్యుల’ కధలు కొన్నైనా గుర్తుకు రాక మానవు.
ఏ పనైనా అందరూ కలసికట్టుగా చేయాలనీ, ప్రతి దానిని సమానంగా పంచుకోవాలని పరమానందయ్య గారు అత్యంత తెలివైన శిష్యులకు ఉపదేశస్తే, వారు చేసిన నిర్వాకాలు ఎన్నో ఎన్నెన్నో. .
అన్నీ కాకపోయినా మచ్చుకి ఓ రెండు సింపుల్ సంఘటనలు గుర్తుకు తెచ్చుకుందాం.
అందులో ఒకటి – ఒక చిన్న సూది తెచ్చిపెట్టండిరా అని అడిగితే అందరూ కలసి లగెత్తి కెళ్ళి చిన్న సూదిని సంపాదించి అంత చిన్న దానిని అందరూ కలిసి ఎలా తీసుకెళ్ళాలో తెలియక ఒక పెద్ద పల్లకీ ని కూడా తయారు చేయించి, దాని మధ్యలో పెట్టి ‘హయ్ హాయ్ నాయకా’ అంటూ నినాదాలు చేస్తూ, మోసుకుంటూ వెళ్లి గురువు గారికి సగర్వంగా సమర్పించుకుంటారు.
ఇంకోసారి – రోజంతా పని చేసి చేసి ఒళ్ళు నొప్పులుగా ఉందంటూ శిష్యులును తలో శరీర భాగాన్ని పట్టుకుని సుఖంగా గా కొద్దిసేపు మర్దన చేయమని ఆదేశిస్తారు.
శిష్యులు అందరూ కాలు, చెయ్యి, వీపు, తలా, భుజం ఇలా తలో భాగాన్ని మృదువుగా తాకుతూ మొదలు పెట్టిన మర్దనతో నిద్రలోకి వెళ్లిన గురువుగారు గట్టిగా అరుపులు, పెడబొబ్బలు వినిపించినట్లు అనిపించి దిగ్గున లేచి చూస్తే, శిష్యులంతా వర్గాలుగా విడిపోయి కత్తులు కటార్లు పట్టుకొని కొట్టుకుంటూ గురువు గారి తమ శరీర భాగం గొప్పదంటే తమది గొప్ప అని వాదులాడుకొంటూ ఎవరి భాగాన్ని వారు మిగతా వారితో కలసి ఉండకుండా నరకబోతుండగా చూసి ప్రాణభయంతో వణుకుతూ గొడవ నివారించటానికి అందరినీ బతిమాలుకోవలసి వచ్చింది
పై రెండు కధలూ ఒక రకం గా నవ్వు తెప్పిస్తున్నప్పటికీ, మరో రకంగా ఉద్వేగాన్ని, విషాదాన్ని కలిగించక మానవు.
అత్యంత గౌరవమున్న ‘తానా’ సంస్థ ప్రస్తుత నాయకత్వం వారి లోపాలకు మసిపూసి మారేడు కాయచేసి ఘనత గురించి గొప్పులు చెపుతున్నప్పటికీ వాస్తవము పై రెండు ‘పరమానందయ్య శిష్యుల’ కధలు మాదిరే ఉన్నాయని తెలిసిపోతోంది.
నాయకుల మధ్య ఐక్యత, నేతి బీరకాయలో నెయ్యి మాదిరి, ఏహ్యత అక్షయపాత్రలో అన్నమంత, ఒకరి కాళ్ళు ఒకరు లాగడం, ఒకరి వీపు మరొకరు పోటు పొడవడం, ఎవరి కళ్ళు వారు మూసుకోవడం అనేది రోజువారీ కార్యక్రమమే అయ్యింది.
మెల్లగా ఆధిపత్యం కోసం మొదలైన వీరి ఆరాటం క్రమక్రమంగా పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టుకుంటా అన్నట్లుగా తయారయ్యింది.
ఇక గత కొన్ని రోజులుగా త్వరితగతిన జరుగుతున్న దిగజారిన రాజకీయ చేష్టలు, అనాలోచిత మరియు అర్ధంలేని వ్యవహారాలను చూస్థున్న అనేకులు ‘పరమానందయ్య శిష్యుల కధలు’ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూనే, బాధపడుతున్నారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన వివరాల్నిబట్టి ఇలా తెలుస్తోంది.
ఎవరికి వారే యమునాతీరే!
ప్రస్తుతం ఇండియా లో ‘తానా చైతన్య స్రవంతి’ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు చాలా విభిన్నవనీ, ఎప్పుడూ జరగని రీతిలో జరుగుతున్నాయని ఊదరగొడుతున్నారు.
కానీ ఆ ఘనత కార్యక్రమాల అమలులో కానీ స్థాయిలో కానీ కాక, ఎన్నడూ లేని విధంగా రెండు వర్గాలుగా విడివిడిగా ఒకే సమయంలో ఎవరికి వారు వేర్వేరు ప్రాంతాల్లో జరుపుతూ ఉండడటం పై పలువురు నిరసన వ్యక్తపరుస్తుండగా, కొన్ని కార్యక్రమాల్లో సేవల వివరాలు, దాతల వివరాలు కంటే ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేని నాయకుల ఫోటోలు,పేర్లు, ప్రసంగాలకు అతిగా ప్రాధాన్యమివ్వడం ఎన్నడూ లేదని అంటూ చిరాకు పడుతున్నారు.
ఈ తీరు ప్రస్తుత ‘తానా చైతన్య స్రవంతి’ లో మాత్రమే కాకుండా ఇంచుమించు ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం ఇలాగే ఉందని చెప్పుకోవచ్చును
ఇంకా గత నలభై సంవత్సరాలుగా మూడు ‘సాంస్కృతిక’ ఆరు ‘సేవా’ కార్యక్రమాలుగా వర్ధిల్లిన ‘తానా’ సంస్థ ఇప్పుడు మూడు ‘లీగల్ పిటిషన్స్’ ఆరు ‘లిటిగేషన్స్‘ గా రూపాంతరం చెందటం సంస్థ గతిని ఎంతవరకూ తీసుకెళ్తుందోనని ‘తానా’ శ్రేయోభిలాషులు ఆందోళన పడుతున్నారు.
ప్రస్తుతం నరేన్ కోడాలి నాయకత్వములో జరుగుతున్న సభ్యుల ఓటు హక్కుకి సంబంధించిన లీగల్ కేసు ఆర్బిట్రేషన్ దశలో ఉండగా, జయ్ వర్గానికి చెందిన వారు కూడా అందులో చేరడానికి దరఖాస్తు చేసుకోగా, లావు వర్గం సభ్యుల ఓటు హక్కుపై చివరిదాకా పోరాడుతా మంటున్నారు.
ప్రస్తుత By-Laws లో స్పష్టంగా ఉన్న నిబంధనలు ఓటు హక్కు రావడానికి ముఖ్య ప్రతిబంధకంగా ఉన్న కారణంగానూ, ఆర్బిట్రేషన్ లో థర్డ్ పార్టీ గా జయ్ వర్గం కూడా చేరడంతో ఈ పోరాటం తీరు తెన్నులు మేధావుల ఊహలకు కూడా అందట్లేదు.
ఇంకా ఫౌండేషన్ చైర్మన్, ట్రెజరర్లను తొలగించిన కేసులో పరువు పోగొట్టుకొని, తానా ఓటమికి కారణమైన లావు/నరేన్ వర్గాలు గెలిచిన వారికి తానా నుంచి లీగల్ ఖర్చులు చెల్లించటానికి ఒప్పుకోవలసి వచ్చింది.
అంతేకాక గత డీసీ తానా కాన్ఫరెన్స్ లెక్కల విషయమై సరైన ముగింపు దిశగా కృషి జరగడం లేదని, కొందరి (నా)మాయకుల బాధ్యతారాహిత్యంపై సరైన చర్యలు అవసరం అని, అలాగే తానా సేవా కార్యక్రమాలకు వివిధ కార్పొరేట్ సంస్థలు మాచింగ్ గ్రాంటుగా ఇస్తున్న నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్నారని కొత్త లీగల్ కేసుల ద్వారా ప్రయత్నాలు సీరియస్ గానే మొదలైనట్లు తెలుస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ ఇప్పటికే విషయం అర్ధమైఉండాలి
ఏదేమైనా మూడు వర్గాలుగా విడిపోయిన ‘తానా’ నాయకులు ప్రతి విషయానికి రాజకీయ ప్రాధాన్యాన్ని, వచ్చే ఎన్నికల్లో లాభాన్ని ఆశిస్తూ అమలు చేస్తుండగా, ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు ఐక్యతను వీడి, స్వంత వర్గానికి, అనుచరులకు ప్రాధాన్యతనిస్తూ వేరే వర్గాలను టార్గెట్ చేస్తూ అపరిపక్వ పాలనతో అందరూ కలిసి అభాసుపాలవుతున్న విషయాన్ని గమనించకుండా ఎవరిని వారు పొగుడుకుంటూ త్రిశంకు స్వర్గంలో విహరిస్తున్నారు.
వీరికి జ్ఞానోదయము అయ్యేదెన్నడో కానీ అప్పటికి ‘తానా’ సంస్థ పరిస్థితి ఎలా ఉంటుందోనని చాలామంది బెంబేలెత్తుతున్నారు
ఇప్పటికైనా వివిధ వర్గాలు తమలో తాము కలహించుకుని బలహీన పరుచుకునే చర్యల కారణంగా తుదకు తన కొమ్మను తానే నరుక్కున్న చందంగా ‘తానా’ సంస్థ బలహీన పడి ఎవరికీ కొరగాకుండా పోతుందనీ, ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కరానికి భేషజాలకు పోకుండా సరి చేసుకుని అత్యంత గౌరవనీయమైన ‘తానా’ సంస్థను కాపాడుకొని మరింత ఉన్నత స్థితికి తీసికెళ్ళే ఆలోచనను వివేచనతో చేస్తారని ఆశిద్దాం.
బలవంతుడు నాకేమని!
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా!
బలవంతమైన సర్పము!
చలి చీమల చేత జిక్కి, చావదె సుమతీ!!
పై పద్యంలోని అర్ధాన్ని గ్రహించి, సత్వర నివారణ చర్యలను సముచిత వ్యక్తుల సహకారంతో ‘ఐకమత్యమే బలం’ అనే విధంగా సాగినచో
ఉందిలే మంచి కాలం ముందు ముందునా!
అందరూ సుఖపడాలి నంద నందనా!
ఎందుకో, సందేహమెందుకో?
రానున్న విందులో నీ వంతు అందుకో!!
అని సంతోషపడవచ్చు లేదూ ఇలాగే కలహించుకొంటూ ముసలం పుట్టిన యాదవ సామ్రాజ్యపు రీతిన ప్రమాదంలో పడి
మారదు లోకం, మారదు కాలం!
దేవుడు దిగిరానీ!
ఎవ్వరు ఏమైపోనీ!
మారదు లోకం!
మారదు కాలం!!
అనుకుంటూ తలలు బాదుకోవాల్సిందే!!