రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని, తాము పచ్చటి పొలాలను ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చామని.. పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. కాలపరిమితితో కూడిన అభివృద్ధి చేయాలని ఆదేశించింది. అయితే.. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది.
పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న అంశాలివే..
రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది
ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు. రాజ ధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి.
2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. అని పేర్కొంది. దీనిపైనే సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అంతకుమించి మూడు రాజధానులపై విచారణ జరపకపోవడం గమనార్హం. అంటే.. మొత్తంగా .. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుగా పరిగణించలేమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.