సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ ఓ కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో సినీ ఫక్కీలో ఈ కేసు మలుపులు తిరుగుతున్న వైనం చర్చనీయాంశమైంది. దాదాపుగా ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సరికొత్త ట్విస్ట్ కు తెర తీసింది.
ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదని, సీబీఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చాలని కోరుతూ ఆమె దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై తాజాగా నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం..సీబీఐ విచారణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి పురోగతి స్టేటస్ రిపోర్టులో లేదని, కేవలం రాజకీయ వైరం అని మాత్రమే ఎక్కడ చూసినా రాసి ఉందని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో రాజకీయ వైరం కారణంగా హత్య జరిగిందని మాత్రమే పేర్కొన్నారని, విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర గురించి సమాచారం వెల్లడించలేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సరిగానే విచారణ జరుపుతున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో, అదనంగా మరో అధికారిని నియమించాలని ధర్మాసనం సూచించింది.
అలా చేయకుంటే తామే మద్యంతర ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. తులసమ్మ పిటిషన్ తర్వాత సీల్డ్ కవర్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా ఆ సీల్డ్ కవర్ పరిశీలించిన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీల్డ్ కవర్లో అంశాలతోనే విచారణ నిర్వహిస్తే నిందితులకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండమంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది.