లిక్కర్ కింగ్ గా పేరున్న విజయ్ మాల్యాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా తానిచ్చిన తీర్పుతో షాకిచ్చింది. జాతీయ బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయిల్ని రుణాలు తీసుకొని విదేశాలకు వెళ్లిపోయిన ఆయనకు కోర్టు ధిక్కారణ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కారం నేరం కింద జైలుశిక్షతో.. రూ.2వేల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో తన కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు లలిత్.. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్..జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ రోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
శిక్ష తప్పదని.. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపాన్ని చూపలేదంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. తాము విధించిన ఫైన్ ను నాలుగు వారాల్లో సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని లేని పక్షంలో మరో రెండు నెలలు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది.
అంతేకాదు.. తాము విధించిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో మాల్యా ఆస్తులు అటాచ్ చేసుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచి పెట్టినందుకు దోషిగా తేలి.. సుప్రీం తాజా తీర్పును ఇచ్చింది. 2017 ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను 2020లో సుప్రీం కొట్టివేసింది.
రూ.9 వేల కోట్లను బ్యాంకు నుంచి రుణంగా తీసుకొని దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మాల్యా 2016 నుంచి యూకేలో ఉండటం.. ఆయన్ను భారత్ కు అప్పగించే విషయం మీద కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు నుంచి తగిలిన షాక్ తో పాటు.. వారి కుటుంబ సభ్యులకు మళ్లించిన నిధుల్ని చెల్లించాలన్న మాటకు మాల్యా ఎలా రియాక్టు అవుతారో చూడాలి.