“ప్రభుత్వాలు శాస్వతం. పార్టీలు మాత్రమే మారుతుంటాయి. వ్యక్తులు మాత్రమే మారుతుంటారు. కానీ, ప్రభుత్వ విధానాలు..లేదా ప్రజలకు అందించే పాలనలో సంస్కరణలు రావాలే తప్ప.. మార్పులు కాదు. గత ప్రభుత్వం నియమించిందన్న ఏకైక కారణం తప్ప.. వీరిని(ప్రెఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు) తొలగించేందుకు మీరు చూపించిన కారణాల్లో ఏదీ సహేతుకంగా లేదు. ఒక ప్రభుత్వంపై అక్కసును ఉద్యోగులపై చూపిస్తారా? “ – సుప్రీం కోర్టు తాజాగా ఏపీలోని వైసీపీ సర్కారును ఇలా నిలదీసింది.
ఎందుకు?
2019(వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు)కు ముందు.. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించింది. అయితే.. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత.. గుండుగుత్తగా వీరిని పక్కన పెట్టేసింది. రిజర్వేషన్లను పాటించకుండా.. నామినేషన్ పద్ధతిలో వీరిని నియమించారన్నది సర్కారు వారి వాదన.
ఈ క్రమంలోనే 2019కు ముందు జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొపెసర్ల నియామకాలు చెల్లవని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వందల మంది ప్రొఫెసర్లు రోడ్డున పడ్డారు. వీరిలో కొందరు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. కానీ, ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. పట్టువదలని ప్రొఫెసర్లు.. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ప్రొపెసర్ల తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లను పాటిస్తూనే వారి నియామకం జరిగిందని పేర్కొన్నారు. దీనిని సుప్రీంకోర్టు సమర్థించింది. రిజర్వేషన్లను అమలు చేసిన తరువాత ప్రొఫెసర్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. ప్రొఫెసర్లను వెంటనే నియమించాలని ఆదేశించింది. అయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకంపై మాత్రం విచారణను వాయిదా వేసింది.